
ఎస్‌జీఎఫ్ క్రీడలకు వేళాయె
మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో పాఠశాల స్థాయిలో క్రీడల సందడి నెలకొననుంది. ఈ నెలతోపాటు రానున్న రెండు నెలలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు జరగనున్నాయి. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్–14, 17 విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా మండల స్థాయి నుంచి జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తారు.
ఈ నెల 20లోగా..
పాఠశాల స్థాయిలో అండర్–14, 17 విభాగాలకు మండల, జిల్లాస్థాయి, జోనల్ (ఉమ్మడి జిల్లా) స్థాయిల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాలోని మండలాల్లో ఈ నెల 20లోగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాస్థాయి, మూడో వారంలో ఉమ్మడి జిల్లా (జోనల్) స్థాయిలో టోర్నమెంట్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన జట్లు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లకు వెళ్తాయి.
వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం
2025– 26 సంవత్సరానికి గాను 69వ ఎస్‌జీఎఫ్ క్రీడలకు సంబంధించి జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులతో మహబూబ్‌నగర్‌లోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 1న జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ మేరకు డీఈఓ ప్రవీణ్‌కుమార్ వ్యాయామ పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఎస్‌జీఎఫ్ క్రీడల ఎంపికలను పారదర్శకంగా నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించి, క్రీడా శిక్షణ ఇవ్వాలని సూచించారు.
20 వరకు మండలస్థాయిలో టోర్నీ కం సెలక్షన్స్
వచ్చేనెల మొదటి వారంలో జిల్లా, మూడో వారంలో ఉమ్మడి జిల్లా
ఎంపికలు