
ఎంపీని కలిసిన శతాబ్ది ఉత్సవ కమిటీ
జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను బాదేపల్లి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. మహబూబ్‌నగర్‌లోని ఆమె నివాసంలో కలుసుకుని నవంబర్ నెలలో నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్మును ఆహ్వానించాలని కోరారు. అదేవిధంగా పాఠశాలను విజిట్ చేయాలని విన్నవించారు. స్పందించిన ఎంపీ రాష్ట్రపతికి పాఠశాల నుంచి, శతాబ్ది ఉత్సవ కమిటీ నుంచి ఉత్సవాల గురించి మెయిల్ చేయాలని కోరారు తాను మెయిల్ చేసి రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకుంటానని ఎంపీ భరోసా ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం పాఠశాల విజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఉత్సవాలకు కేద్రమంత్రులను ఆహ్వానించాలని అందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఎంపీని కలసినవారిలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్, ప్రధాన కార్యదర్శి రమణాచార్యులు, ఎంఈఓ మంజులాదేవి, హెచ్‌ఎం చంద్రకళ, కమిటీ ఉపాధ్యక్షులు సత్యం, వెంకటేశ్, కోశాధికారి రామకృష్ణ, కార్యనిర్వహణ కార్యదర్శి ఆనంద్, ఉపాధ్యాయులు ఇబ్రహీం, గోపాల్, లక్ష్మణ్, మౌనిక ఉన్నారు.
ఆలయంలో హుండీ చోరీ
మల్దకల్: మండలంలోని మద్దెలబండ ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీ చోరీ చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఆదివారం ఆలయం గేటు తాళాలను పగులగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. ఆలయ సమీపంలో హుండీ పగులగొట్టి ఏడాదిగా భక్తులు సమర్పించిన కానుకలు అపహరించినట్లు ఆలయ నిర్వహకుడు సిద్ధప్ప తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
రెండు తులాల బంగారు గొలుసు అపహరణ
నాగర్‌కర్నూల్ క్రైం: గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో బంగారు గొలుసు చోరీకి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన జ్యోషి కళ్యాణ్‌శర్మ నాగనూలు చౌరస్తాలోని తన ఇంటికి గతనెల 28న తాళం వేసి బళ్లారి వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం విరగ్గొట్టి సూట్‌కేస్‌లో ఉన్న రెండుతులాల బంగారు గొలుసు చోరీ చేశారు. జ్యోషికళ్యాణ్‌శర్మ బళ్లారి నుంచి శనివారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా తాళం విరగ్గొట్టి ఉండడంతోపాటు సూట్‌కేసు తెరిచి ఉండడం గమనించి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.