
బాలికలకు రక్షణగా షీటీంలు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో షీటీం బృందాల ద్వారా బాలికలకు, మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, రద్దీ ప్రాంతాల్లో నిత్యం నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జూలైలో మొత్తం 25 ఫిర్యాదులు రాగా... రెండు కౌన్సెలింగ్ రెండు, 15 రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి, ఐదు ఈ–పెట్టీ కేసులు, మూడు ఎఫ్‌ఐఆర్‌లు, 21 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో 60 హాట్ స్పాట్ ఏరియాలు బృందాలు తనిఖీ చేసినట్లు వెల్లడించారు. షీటీం పోలీసులు పాఠశాలలు, కళాశాలల దగ్గర ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈవ్‌టీజింగ్ లేదా రోడ్లపై వెంబడించినా, అవహేళన చేస్తూ మాట్లాడినా డయల్ 100 లేదా 87126 59365 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు
జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో భాగంగా ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న క్రమంలో డీఎస్పీ లేదా ఇతర పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి పబ్లిక్ సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేయరాదని సూచించారు. కత్తులు, తుపాకులు, పేలుడు పదార్థాలు, నేరానికి పాల్పడే ఎలాంటి ఆయుధాలు అయిన వాడరాదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లౌడ్ స్పీకర్లు, డీజేలు నిషేధించడం జరిగిందని, ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 కింద శిక్ష అర్హులని తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్‌తో
133 చిన్నారులను రక్షించాం
జూలై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–11 ద్వారా జిల్లాలో 133 మంది పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా బడి ఈడు పిల్లలు బడిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్య శాఖ, చిన్నారుల రక్షణ శాఖల సమన్వయంతో ముమ్మరంగా తనిఖీ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రక్షించిన వారిలో 122 మంది బాలురు, 11 మంది బాలికలు ఉన్నారని వీరిలో 38 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కన్పిస్తే డయల్ 100 లేదా జిల్లా కంట్రోల్ రూం 87126 59360 సమాచారం ఇవ్వాలని సూచించారు.