
నిరంతర విద్యుత్ కోసం రైతుల ఆందోళన
మహబూబ్‌నగర్ రూరల్: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మనికొండ సబ్‌స్టేషన్ ముందు రైతులు ధర్నా చేపట్టారు. సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఆపరేటర్ త్రీ ఫేస్ కరెంట్‌ను సక్రమంగా సరఫరా చేయకపోవడం వల్ల పంటల సాగుకు అవసరమైన విద్యుత్ సరఫరా కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిమార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం గురించి తెలుసుకున్న ఏడీ మద్దిలేటి హుటాహుటిన మనికొండ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోనని, అందరిని మూకుమ్మడిగా సస్పెండ్ చేస్తానని ఏడీ సిబ్బందిని హెచ్చరించారు. ఏడీ హామీతో రైతులు తమ ధర్నాను విరమించారు. ధర్నాలో బీజేపీ మండల అధ్యక్షుడు గంగన్న, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు సుధా సాగర్, మల్లేష్, శ్రీశైలం, నర్సిములు, వీరేష్, శేఖర్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.