ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు

Jul 30 2025 7:14 AM | Updated on Jul 30 2025 7:16 AM

పేరుకేమో ప్రభుత్వ వైద్యులు.. జీతం తీసుకునేది ప్రభుత్వం నుంచి.. పని చేయాల్సింది జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో.. కానీ, నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని అక్కడే తరిస్తున్నారు. రూ.లక్షలు జీతాలు చెల్లించే జీజీహెచ్‌కు మాత్రం వంతుకు గంతేసినట్లు.. ఇలా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా అలా వెళ్లిపోతున్నారు. ఫలితంగా వివిధ రోగాలతో పెద్దాస్పత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. వీరిని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులేమో.. అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేయడం వరకే పరిమితమవుతున్నారు.

– పాలమూరు

అలవెన్స్‌ ఇవ్వడం లేదు..

ప్రభుత్వం నాన్‌ ప్రాక్టీసింగ్‌ అలవెన్స్‌ ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వీరిపై రిక్రూట్‌మెంట్‌ బోర్డు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం సూపరింటెండెంట్‌ పరిధిలో ఉండదు.

– మాధవి, తాత్కాలిక సూపరింటెండెంట్‌, జనరల్‌ ఆస్పత్రి

హబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించకపోవడం మొదలు రోగులకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా బయట సొంతంగా ప్రైవేట్‌ క్లినిక్‌లు నడుపుతున్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ సమయంలోనే బయట ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేయరాదని స్పష్టంగా పేర్కొన్నారు.. వైద్యులు సైతం అలాట్‌మెంట్‌ కాపీలో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయమని రాసిచ్చినా.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్థాయి వైద్యులు ఏ ఒక్కరూ నిబంధనలు పాటించడం లేదు. జనరల్‌ ఆస్పత్రిలో తూతూమంత్రంగా 3 గంటలు విధులు నిర్వహిస్తూ మిగిలిన సమయమంతా సొంత ఆస్పత్రుల్లో గడుపుతున్నారు. ఇక శనివారంతో పాటు ఆదివారాల్లో ఏ ఒక్కరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రధానంగా సైకియాట్రిక్‌, కంటి, చర్మం, దంత తదితర విభాగాలకు చెందిన వైద్యులు రాత్రి వేళ డ్యూటీలో ఉండటం లేదు. కల్లు తాగిన రోగి ఆస్పత్రికి చికిత్స కోసం వస్తే రాత్రివేళ వైద్యం చేయడానికి సైకియాట్రిక్‌ విభాగం నుంచి ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. ఇక రేడియాలజీ విభాగం వాళ్లు కూడా లేకపోవడంతో రాత్రివేళ అత్యవసర కేసులు వస్తే బయటకు రెఫర్‌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

రూ.30–40 వేల జీతానికి..

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 170 మంది హౌజ్‌ సర్జన్‌లలో దాదాపు 40 శాతం మంది నగరంలోని పలు ప్రైవేట్‌ క్లినిక్‌లలో డ్యూటీ డాక్టర్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం హౌజ్‌ సర్జన్‌ పూర్తయ్యే వరకు వారికి బయట ప్రాక్టీస్‌ చేయడానికి అనుమతి ఉండదు. కానీ, వాళ్లు కూడా ఇందుకు విరుద్ధంగా రూ.30–40 వేల జీతానికి ప్రైవేట్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

రాత్రివేళ అవస్థలు

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో సాయంత్రం తర్వాత అన్ని విభాగాల వైద్యులు డ్యూటీలో అందుబాటులో లేకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఆ రోజు డ్యూటీలో ఉండే వారైతే ఎక్కడో ఉంటూ ఫోన్‌లో జూనియర్స్‌కు చికిత్స విధానం చెబుతున్నారు. దీంతో రోగులకు ఆశించిన స్థాయిలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. మేజర్‌ విభాగాల దగ్గరి నుంచి మైనర్‌ వరకు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు రేడియాలజీ, పెథాలజీ విభాగం సైతం రాత్రివేళ సక్రమంగా సేవలు అందడం లేదు. దీంతో అత్యవసరంగా వైద్యం కోసం వచ్చిన రోగులకు అల్ట్రాసౌండ్‌ పరీక్షలు, ఎంఆర్‌ఐ, మేజర్‌ ఎక్స్‌రే, రక్త పరీక్షలు ఇలా ఏదైనా అవసరం వస్తే బయటకు వెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

‘ప్రైవేట్‌’ క్లినిక్‌లో తలమునకలవుతున్న జనరల్‌ ఆస్పత్రిలోని పలువురు వైద్యులు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సొంతంగా ప్రాక్టీస్‌ చేయొద్దని ఉత్తర్వులు

ఖాళీలు భర్తీ చేసే సమయంలోనే స్పష్టంగా పేర్కొన్న ప్రభుత్వం

మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రిలో కనిపించని వైనం

రాత్రివేళ అత్యవసర వైద్యానికి

తప్పని తిప్పలు

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు 1
1/3

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు 2
2/3

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు 3
3/3

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement