
వనమహోత్సవం లక్ష్యం చేరాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్‌తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీపీఎంలు, ఏపీఎంలు తదితరులతో నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వచ్చే వారంలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు మండలంలోని ఒక పాఠశాలను ఎంపిక చేసుకొని అక్కడ న్యూట్రి గార్డెన్ కోసం నిర్దేశించిన మొక్కలను నాటాలని, న్యూట్రి గార్డెన్ మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రొసీడింగ్స్ వచ్చిన వారు మార్క్ ఔట్ చేసుకునేలా చూడాలని, ప్రొసీడింగ్స్ వచ్చి, నిర్మాణం చేపట్టని వారితో మాట్లాడి.. వేరే వారికి కేటాయించేలా చూడాలని, తద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని అన్నారు. అర్హత ఉన్నా ఇల్లు కట్టేందుకు డబ్బులు లేకపోతే వారికి బ్యాంకు నుంచి లేదా లోన్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ, డ్రెయిన్లు శుభ్రపరచడం వంటివి ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, చెత్త, నీరు నిల్వకుండా చూడాలన్నారు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలిపే ఫోర్ క్యాస్ట్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చెరువులో నీరు నిండి ఎలాంటి ప్రమాదాలు కానీ, ఇళ్ల లోపలికి రావడం వంటివి జరగకుండా పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి వెంటనే వేరే చోటుకి తరలించాలని చెప్పారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు, ఒరిగి న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను సరిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలి
జిల్లాలో భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్ కెనాల్, కేఎల్‌ఐ, రైల్వే డబుల్ లైన్ కోసం భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎక్కడ ఎంత భూమి సేకరించాలి.. ఇప్పటి వరకు ఎంత సేకరించారు.. ఈపాస్ అవార్డు ఎంత కంపెన్సీషన్ మంజూరయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని పనులను, సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.