
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక పద్ధతులు అమలు చేయాలని ఎస్పీ డి.జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ వారీగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి అధికారులు చొరవ చూపించాలని, ఎన్‌డీపీఎస్ చట్టాలపై స్పష్టమైన అవగాహనతో కేసులు దర్యాప్తు పూర్తి చేసి దో షులకు శిక్షలు పడే విధంగా చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో వేగవంతమైన విచారణ జరగాలని, సీసీటీవీలను కమ్యూనిటీ పోలీసింగ్‌లో మరింత విస్తరించే విధంగా చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పా టు ట్రాఫిక్ నియంత్రణ కోసం శాఖ మధ్య సమన్వ యం చేసుకోవాలన్నారు. ముఖ్య పట్టణాల్లో రాత్రి వేళ పెట్రోలింగ్ విస్తృతం చేయాలన్నారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్స్‌పై నిఘా కొనసాగించాలన్నారు. గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలు, పేకాట, పీడీఎస్ రైస్ అక్రమ తరలింపు, ఇసుక మాఫియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
బైక్‌లకు సైలెన్సర్లు మార్పు చేస్తే కఠిన చర్యలు
శబ్ద కాలుష్యానికి కారకులు అయిన వారితో పాటు షోరూం నుంచి వచ్చిన సైలెన్సర్లు కాకుండా మోడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీహెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీల ద్వారా బైక్‌కు సంబంధించిన 155 మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని ఎస్పీ సమక్షంలో మంగళవారం బండమీదిపల్లి సమీపంలో రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు. షోరూం నుంచి వచ్చిన సైలెన్సర్ కాకుండా మార్పులు చేసి అధిక శబ్ధాలు చేస్తూ ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు తెలిపారు. ఇలా చేయడం చట్ట వ్యతిరేకరమే కాకుండా ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతుందన్నారు. మెకానిక్‌లు సైతం ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్పు చేయరాదన్నారు. ఆయా సమావేశాల్లో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు వెంకటేష్, అప్పయ్య, గాంధీనాయక్, కమలాకర్, నాగార్జునగౌడ్, భగవంతురెడ్డి, ఎస్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల పరిష్కారంపై
దృష్టి సారించండి : ఎస్పీ డి.జానకి