
ఉద్యమం చేసేందుకుసిద్ధంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఇక ఉద్యమం చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్, టీఎన్‌జీఓ జిల్లా అద్యక్షుడు రాజీవ్‌రెడ్డి, టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, జిల్లా కోశాధికారి కృష్ణమోహన్, జిలా అసోసియేట్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ఓ ప్రకటన లో తెలిపారు. ఉద్యోగల, పెన్షనర్ల సమస్యలను పరిష్కారం కోసం గడిచిన 17 నెలలుగా ఎంతో ఎదురు చూశామని తెలిపారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలను విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన చర్చలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆరోపించారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ మాట ఎత్తడం లేదని తెలిపారు. కేంద్ర సంఘం నాయకత్వం పిలుపు మేరకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉద్యమబాట పట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల జేఏసీ ఇచ్చే ప్రతి పిలుపుకు టీఎన్‌జీఓ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అందుకనుగుణంగా టీఎన్‌జీఓ సంఘం నాయకులు, ఉద్యోగులు భవిష్యత్ కార్యచరణకు సిద్ధంగా ఉండాలని కోరారు.
రేపు గురుకులాల్లో
స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మండలంలోని రాంరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ ఎంఈసీ, సీఈసీ, ఎంపీసీ గ్రూప్‌లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం గురువారం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ వాణిశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు గురువారం ఉదయం 10 గంటలకు గురకులం వద్దకు రావాలని, ఎస్సెస్సీ మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
నంచర్ల గురుకులంలో..
మహమ్మదాబాద్: నంచర్ల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిన సీట్లకు గాను గురువారం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రమ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి స్పాట్ అడ్మిషన్లు పొందాలని సూచించారు.
ప్రాక్టికల్స్‌కు 51మంది అభ్యర్థులు హాజరు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఎంపికకు రెండు నెలలుగా శిక్షణ ఇచ్చిన సర్వే ఆండ్ ల్యాండ్ రికార్డుల శాఖ రెండోరోజు మంగళవారం ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించింది. లైసెన్స్‌డ్ సర్వేయర్ ఎంపిక కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 230 మంది అభ్యర్థులుండగా వారిని ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. అందులో మొదటి విడతగా 132 మందికి భూసర్వే నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. రెండు నెలలుగా శిక్షణ పొందిన 98 మంది అభ్యర్థులను రెండు బ్యాచ్‌లుగా ఏర్పాటు చేసి సోమవారం 47 మందికి, రెండో రోజు 51 మంది ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించింది.