మళ్లీ రెవెన్యూ సదస్సులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: గత తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి ఆర్‌ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. భూ ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్, ధరణి చట్టం అమలు, తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు, వెంటనే ముటేషన్లు వంటి చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రాకపోగా మరిన్ని భూ సమస్యలు పెరిగాయి. ధరణి అమలులో భూ రికార్డుల్లోని తప్పొప్పుల సవరణ, అభ్యంతరాల పరిశీలన వంటి అంశాలకు చోటు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తాయి. ధరణి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ చట్టానికి చట్టబద్ధత కల్పించిన అనంతరం నియమ, నిబంధనలు రూపొందించి.. చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి భూ భారతి చట్టం అమలుపై దృష్టిసారించింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో మళ్లీ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ భారతి చట్టం అమలు, సమస్యల పరిష్కారంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని నిర్ణయించింది. కాగా ఇప్పటికే జిల్లాలోని మూసాపేట మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అక్కడ ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 2 నుంచి అన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
సవరణలకు ఆస్కారం
ఆర్‌ఓఆర్–2025 భూ భారతి చట్టం అమలులో కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తప్పొప్పుల సవరణ చేపట్టనున్నారు. భూమి ఉండి దానికి సంబంధించి రికార్డు లేకపోవడం, పట్టాదారు పాస్ బుక్ ఉన్నా భూమి లేకపోవడం, రికార్డుల్లో విస్తీర్ణాల తేడా, భూమి సంక్రమించిన విధానం, పట్టాదారు పేర్లలో తప్పులు వంటి దరఖాస్తులపై రెవెన్యూ సదస్సుల్లో పరిశీలన, వాస్తవికత ఆధారంగా సవరణ చేస్తారు. భూ ప్రక్షాళన సమయంలో పట్టాభూములు కోల్పోయిన రైతుల భూ సమస్యలను పరిశీలిస్తారు. గతంలో ఇలాంటి సవరణలకు ఆస్కారం ఉండేది కాదు. ధరణిలో తహస్లీల్దార్లకు ఎలాంటి అధికారాలు లేకపోగా.. ప్రస్తుత భూ భారతి చట్టంలో తహసీల్దార్లతోపాటు ఆర్డీఓలు, కలెక్టర్లకు అధికారాలు కల్పించనున్నారు.
రీ సర్వేకు చోటు
భూ భారతి చట్టంలో క్షేత్రస్థాయి కీలక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రధానంగా భూముల రీ సర్వే జరిగితే క్షేత్రస్థాయిలోనే ఎన్నో సమస్యలకు మార్గం సుగమవుతుంది. రికార్డుల ప్రక్షాళనతోపాటు భూ సర్వేకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. సర్వే నంబర్ల వారిగా హద్దుల గుర్తింపుతోపాటు సబ్ డివిజన్ సమస్యలకూ చెక్ పడనుంది.
జిల్లావ్యాప్తంగా ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద పూర్తయిన మూసాపేట మండలం
తప్పొప్పుల సవరణతోపాటు ఇతర సమస్యలపై అభ్యంతరాల నమోదు
భూ భారతి చట్టం పకడ్బందీ అమలుపై అధికారుల కసరత్తు
మళ్లీ రెవెన్యూ సదస్సులు


