‘పాలమూరు’ పై రాజకీయం సరికాదు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.74 వేల కోట్ల వ్యయం అవుతుండగా.. కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి 90 శాతం పనులు పూర్తి చేశామని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు, కాల్వల నిర్మాణమే పూర్తి చేయకుండా బీళ్లకు నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టుకు పెద్దపీట వేశామనడం సిగ్గుచేటని.. కాల్వల నిర్మాణానికి ఇంకా 4 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. వీటిని పక్కనబెట్టి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు కొత్త బిల్లు తెచ్చిందని.. కార్మికుల పొట్టకొట్టేలా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో సుమారు 13 వేల మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. అక్రిడిటేషన్ విషయంలో పాత విధానాలను అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. నేటి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అంశం చర్చలకే పరిమితం కావద్దని.. కేంద్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై న్యాయమైన పోరాటాలకు సీపీఎం సంపూర్ణ సహకారం అందిస్తోందని భరోసానిచ్చారు. యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఒకరినే నిందితులుగా చూపి మిగతా వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. సిట్టింగ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్, కురుమూర్తి, పద్మ, చంద్రకాంత్, లక్ష్మయ్య, దీప్లానాయక్, జగన్, నర్సింహులు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


