భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి

Dec 29 2025 9:01 AM | Updated on Dec 29 2025 9:01 AM

భవనంప

భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి

అచ్చంపేట రూరల్‌: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన అచ్చంపేట పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. వెంకటేశ్వరనగర్‌ కాలనీకి చెందిన అమర్‌సింగ్‌ రెండో కూతురు భావన (17) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్రిస్మస్‌ సెలవులు ఉండటంతో అచ్చంపేటకు వచ్చిన విద్యార్థిని.. శనివారం రాత్రి ఇంటి రెండో అంతస్తులో వాకింగ్‌ చేస్తూ, ప్రమాదవశాత్తు జారి కింద పడింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భావన మృతిచెందింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

అప్పలు బాధతో

యువకుడి ఆత్మహత్య

జడ్చర్ల: అప్పులు ఎలా తీర్చాలన్నా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్‌ కథనం మేరకు.. ఏపీలో సత్యసాయి జిల్లా వెంపర్లపల్లి గ్రామానికి చెందిన చాకలి సురేశ్‌బాబు(25) పోలేపల్లి సెజ్‌లోని ఓ పరిశ్రమలో 10 నెలలుగా ఉద్యోగం చేస్తూ సత్యనారాయణస్వామి కాలనీలో తోటి ఉద్యోగులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరు మిత్రులు విధులకు వెళ్లగా ఒంటరిగా ఉన్న సురేశ్‌బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులు ముగించుకొని ఆదివారం గదికి వచ్చిన మిత్రులు తలుపులు విరగ్గొట్టి చూడగా ఉరి వేసుకొని ఉన్నాడు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

15 క్వింటాళ్ల రేషన్‌

పట్టివేత

అలంపూర్‌ రూరల్‌: అలంపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంపూర్‌ గ్రామానికి చెందిన కుర్వ మారుతి(25) 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మారుతి ఆదివారం తెల్లవారుజామున అశోక్‌ లేలాండ్‌ వాహనంలో ప్రభుత్వం సరఫరా చేసే 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కోనేరు నుంచి అలంపూర్‌ మీదుగా కర్నూలుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. సివిల్‌ సప్లై డీటీ ప్రశాంత్‌గౌడ్‌ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

గద్వాల క్రైం: అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న గూడ్స్‌ వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ తెలిపారు. ఇటిక్యాల మండలం మొగిలిరావు గ్రామానికి చెందిన శివరాజు, డ్రైవర్‌ మల్లికార్జున్‌ ఆదివారం గూడ్స్‌ వాహనంలో గద్వాల మీదుగా రాయచూర్‌కు రేషన్‌ బియ్యం తరలిస్తుండడగా ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో 35 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అలవి వలల పట్టివేత

చిన్నంబావి: మండలంలోని కాలూరు సమీపంలోని కృష్ణానదిలో అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్‌ఐ నాగారాజు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. చేపట వేట కొనసాగిస్తున్న కృష్ణ, వెంకన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. నిషేధిత అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆపదలో ఉన్నానంటూ సైబర్‌ మోసం

జడ్చర్ల: ఆపదలో ఉన్నాను.. తనకు డబ్బులు పంపాలని మెసేజ్‌ పంపి ఓ దుండగుడు సైబర్‌ మోసానికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. కర్నూల్‌కు చెందిన బాల్‌రాజ్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ స్థానిక వెంకటేశ్వర కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అతనికి.. అమెరికా నుంచి పలాన ఫ్రెండ్‌ను మాట్లాడుతున్నాను.. అర్జంట్‌గా తనకు డబ్బు కావాలి వెంటనే ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయాలని వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చింది. వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ అనంతరం మెసేజ్‌ను నమ్మిన అతను రూ.45వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. స్క్రీన్‌ షాట్‌ తీసి వాట్సాప్‌లో పంపగా అటువైపు నుంచి రెస్పాన్స్‌ రాకపోవడంతో అనుమానం వచ్చి అమెరికాలో ఉంటున్న తన మిత్రుడికి ఫోన్‌ చేశాడు. తాను ఎటువంటి మెసేజ్‌ చేయలేదని, తనకి డబ్బు కూడా రాలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన సదరు వ్యక్తి వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి  
1
1/1

భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement