ఎన్నికలు బహిష్కరించినా పట్టింపు లేదా?
● ‘గోకారం’ నిర్వాసితులకు న్యాయం చేయాలి
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
చారకొండ/మన్ననూర్: డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే గోకారం రిజర్వాయర్‌లో ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ముంపునకు గురికాకుండా మినహాయించాలని గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం సరైంది కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చారకొండ మండలం ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలకు ఆదివారం ఆమె మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గోకారం రిజర్వాయర్ నిర్మాణంతో ఇక్కడి ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుతుందన్నారు. తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు మూకుమ్మడిగా పంచాయతీ ఎన్నికలు బహిష్కరించడం ప్రజాస్వామంలో అతిపెద్ద నిరసన అని అన్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్, ఇక్కడి పాలకులు, అధికారులకు పట్టింపు లేకపోవడం సమంజసం కాదన్నారు. వెంటనే కలెక్టర్ మంపు బాధితులను కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట కల్వకుర్తి జేఏసీ కన్వీనర్ సదానందంగౌడ్, సర్పంచ్ పరుశరాములు, నాయకులు ఏపీ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేశ్ తదితరులు ఉన్నారు.
● ఆదివాసీ చెంచుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ గ్రామాన్ని ఆమె సందర్శించి చెంచుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చెంచులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, రవాణా, రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామంలో రూ. 5లక్షల వ్యయంతో నిర్మించిన పక్కా ఇళ్లు పూర్తి నాసిరకంగా ఉన్నాయన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను ఆమె పరిశీలించారు. చెంచులకు దోతి, చీరలను పంపిణీ చేశారు.


