లోతట్టు ప్రాంతాలు జలమయం
జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారిపై నిలిచిన వర్షం నీరు
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో నిలిచిన నీరు
మహబూబ్‌నగర్‌లోభారీ వర్షం
● ఉదయం రెండున్నర గంటలు, రాత్రి 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వాన
● పొంగిపొర్లిన ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు
● పరిశీలించిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్,ఆర్‌డీఓ, ఎమ్మెల్యే
● మహబూబ్‌నగర్ అర్బన్‌లో 2.07 సెం.మీ. వర్షపాతం నమోదు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో బుధవారం ఉదయం ఏడు నుంచి 9.30 గంటల వరకు ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా డివిజన్ల పరిధిలోని ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో ని రోడ్లన్నీ మురుగుమయంగా మారాయి. ముఖ్యంగా డివిజన్ నం.25లోని గోల్‌మసీదు, గచ్చిబౌలి, డివిజన్ నం.1, 5, 11, 21, 22, 23, 24లలోని వెంకటేశ్వరకాలనీ, లక్ష్మీనగర్‌కాలనీ, పోచమ్మకాలనీ, పాత పాలమూరు, మర్లు–ఎంప్లాయిస్ కాలనీ, బీకేరెడ్డి కాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్‌లలో రోడ్లపై వర్షపునీరు ఏరులై పారింది. అలాగే 13 విలీన గ్రామాలలోని మట్టి రోడ్లన్నీ బురదమయమయ్యాయి. రెండున్నర గంటల పాటు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కూడా చాలా చోట్ల మోకాలు లోతు నీరు ప్రవహించడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా గచ్చిబౌలి లోని కొన్ని ఇళ్లు రోడ్డుకు తక్కువ ఎత్తులో ఉండటంతో లోపలికి వర్షపు నీరు చేరింది. ఈ కాలనీలోని రోడ్లన్నీ ఇరుకిరుకుగా ఉండటంతో మధ్యాహ్నం వరకు వర్షపు నీటితో నిండిపోయాయి. ఇళ్లలోకి వచ్చిన నీటిని బయటకు తోడివేసేందుకు ప్రజలు కష్టాలు పడ్డా రు. వర్షం ఆగిపోయాక గచ్చిబౌలి, గోల్‌మసీదు ప్రాంతాలను అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, పాతపాలమూరులో ఆర్‌డీఓ ఇ.నవీన్, డీటీ దేవేందర్, ఆర్‌ఐ సుదర్శన్‌రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించారు. కాగా.. గచ్చిబౌలిలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. ఇందుకోసం ఎర్రకుంట తూము కాల్వతో పాటు అలుగు నుంచి వేర్వేరుగా వర్షపు నీరు ముందుకు వెళ్లేలా డ్రెయినేజీలను విస్తరించాలని ఆదేశించారు. ఇక మహబూబ్‌నగర్ అర్బన్ ప్రాంతంలో 2.07 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాగా.. మరోసారి సాయంత్రం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలో పలుసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
లోతట్టు ప్రాంతాలు జలమయం


