విద్యార్థి ప్రాణం తీసిన పిడుగు
దేవరకద్ర రూరల్: ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. బాగా చదువుకొని తమకు అండగా నిలుస్తాడని ఆశిస్తున్న తరుణంలో.. పిడుగుపాటు రూపంలో వచ్చిన మృత్యువు వారి ఆశలను కబళించింది. కన్నవారికి తీరని శోకం మిగిల్చిన ఈ ఘటన ఆదివారం దేవరకద్ర మండలం గద్దెగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గద్దెగూడెం గ్రామానికి చెందిన రైతు బత్తుల కృష్ణయ్య వ్యవసాయం, పాడి ఉత్పత్తితో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం తనకు పొలం వద్ద పని ఉండటంతో వెళ్లాడు. ఇంటర్ పూర్తిచేసుకుని వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన అతడి కుమారుడు ఉదయ్‌కుమార్ (18) పశువులను మేపేందుకు వెళ్లగా.. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడటంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఉన్న ఒక్కగానొక కుమారుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


