
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో యాసంగి 2023– 24 వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ శృతిఓజా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లై న్ చేస్తూ ధాన్యం అమ్మిన రైతులకు సత్వరమే డబ్బు లు అందేలా చూడాలన్నారు. వర్షం కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. నెలాఖరులోగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు రవాణా చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ధాన్యం రాకను దృష్టిలో ఉంచుకుని మండలాల్లో ఐకేపీల ఆధ్వర్యంలో 12, పీఏసీఎస్‌లలో 11 చోట్ల కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,534 రైతుల నుంచి 19,052 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.33.45 కోట్లు చెల్లించామన్నారు. కాగా, అంతకు ముందు మిడ్జిల్ మండలంలోని రాణిపేట, మున్ననూరులో పీఏసీఎస్‌ల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్ శృతిఓజా ధాన్యం కొనుగోళ్ల వివరాలను అధికారులతోపాటు అక్కడి రైతులతో ఆరా తీశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఆర్‌డీఓ నర్సింహులు, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, డీసీఓ పద్మ పాల్గొన్నారు.