అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
పాలమూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి తప్పులకు తావివ్వకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పరిశీలించిన తర్వాత అనంతరం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన అభ్యర్థుల వివరాలను నమూనా–7(ఫారం–7)లో నమోదు చేయాలని సూచించారు. బ్యాలెట్ పేపర్‌ను సక్రమంగా రూపొందించాలని, నమూనా–7 తయారు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మొదట రాజకీయ పార్టీల బీ–ఫామ్‌ల ఆధారంగా ఆయా అభ్యర్థులకు సరైన గుర్తులు కేటాయించాలని, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు కోరుకున్న విధంగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వారికి గుర్తులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్‌డీఓ నర్సింహులు, నగర పాలక కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా భద్రత ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ డి.జానకి పరిశీలించారు. పోలీస్ విధుల నిర్వహణపై సిబ్బందికి సూచనలు అందించారు. నామినేషన్ల ఉపసంహరణ, బీ–ఫామ్ సమర్పణ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.


