చివరి వరకు బుజ్జగింపులు | - | Sakshi
Sakshi News home page

చివరి వరకు బుజ్జగింపులు

Feb 4 2026 7:34 AM | Updated on Feb 4 2026 7:34 AM

చివరి వరకు బుజ్జగింపులు

చివరి వరకు బుజ్జగింపులు

పాలమూరు: కార్పొరేషన్‌ ఎన్నికలు మహబూబ్‌నగర్‌ నగరంలో హీట్‌ పెంచుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించుకోవడానికి బుజ్జగింపుల పర్వం నడిచింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా 11 గంటల తర్వాత కార్పొరేషన్‌ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. చివరి ఐదు నిమిషాల్లో కూడా దాదాపు పదిమంది సభ్యులు హడావుడిగా పరుగులు తీస్తూ వచ్చిన దృశ్యాలు కన్పించాయి. కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా 781 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరుగురి నామినేషన్ల తిరస్కరణ తర్వాత డబుల్‌ నామినేషన్లు తీసివేయగా.. 516 మంది మిగిలారు. వీరిలో సోమవారం 14మంది, మంగళవారం 155 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లలో 347 మంది పోటీలో ఉన్నారు.

బీఫామ్‌లు అందించిన పార్టీలు

అధికార కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన 60మంది కార్పొరేటర్ల అభ్యర్థులకు సంబంధించిన బీఫామ్‌లను డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌ మధ్యాహ్నం 1.18 గంటల సమయంలో నేరుగా తీసుకొచ్చి అధికారులకు అందించాడు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ పార్టీలకు సంబంధించిన బీఫామ్‌ల జాబితాను తీసుకొచ్చి అధికారులకు అందించారు. బీజేపీ, ఎంఐఎం పార్టీల బీ–ఫామ్‌లను ఆయా డివిజన్‌ రిటర్నింగ్‌ అధికారులు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో 35వ డివిజన్‌ నుంచి టికెట్‌ అశించిన సాయిబాబా.. 20ఏళ్లుగా పార్టీలో ఉన్నవారికి టికెట్‌ ఇవ్వకుండా కొత్తవారికి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 49వ వార్డు నుంచి నామినేషన్‌ వేసిన వసంత రాఘవేందర్‌రాజు పార్టీ పెద్దల సూచన మేరకు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. కాగా.. కాంగ్రెస్‌లో బీఫామ్‌ దక్కని వారు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. ఇది ఆ పార్టీకి కొంత కలవరపాటుకు గురిచేస్తోంది.

● నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా కార్పొరేషన్‌ కార్యాలయం లోపలికి కేవలం అభ్యర్థులను మాత్రమే పోలీసులు అనుమతి కల్పించారు. ఒక్కో అభ్యర్థికి నామినేషన్‌ పత్రాలను తనిఖీ చేసి లోపలికి పంపించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్పయ్య బందోబస్తును పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement