సాక్షిప్రతినిధి, వరంగల్:
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా తెలంగాణ సీఐడీ మరో కీలక అడుగు వేసింది. ఏళ్ల తరబడి తమ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారుల గుర్తింపు, వారి క్లెయిమ్‌ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ప్రత్యేక బాండ్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనుంది. దీనికోసం వరంగల్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి జిల్లా, మండలాల వారీగా షెడ్యూల్ విడుదల చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల కోసం వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రాణి రుద్రమదేవి హాల్లో ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరు జిల్లాల పరిధిలోని ఖాతాదారులు తమకు కేటాయించిన తేదీల్లో ఇక్కడికి వచ్చి బాండ్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలనకు అందించాల్సి ఉంటుంది. ఈ కేంద్రానికి ప్రత్యేక అధికారిగా ఈ. హరికష్ణను నియమించారు.
బాండ్లతోపాటు ఇతర పత్రాలు తప్పనిసరి..
నామినీ, వారసులకు అవకాశం
వెరిఫికేషన్‌కు వచ్చే బాధితులు అసలు అగ్రిగోల్డ్ బాండ్ లేదా నగదు రశీదును తీసుకురావాలి. వీటితోపాటు బాండ్ కలర్ జిరాక్స్‌పై సంతకం చేసి సమర్పించాలి. ఆధార్, పాన్‌కార్డుల ప్రతులు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటో, ఖాతాదారుడి మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తెలిసి ఉంటే ఆ వివరాలు కూడా అందించాలి. ఒకవేళ డిపాజిటర్ మరణిస్తే నామినీ ద్వారా బాండ్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. నామినీ కూడా మరణించిన సందర్భంలో చట్టబద్ధ వారసులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి. డిపాజిటర్ అనారోగ్యం లేదా ఇతర కారణాలతో వ్యక్తిగతంగా రాలేని పక్షంలో కుటుంబ సభ్యులు అధికార లేఖతో హాజరై ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఏజెంట్లు సైతం తమ వద్ద ఉన్న బాండ్ల వివరాలను సంబంధిత పత్రాలతో అందించే అవకాశం కల్పించారు.
ఖాతాదారుల గుర్తింపునకు సీఐడీ ప్రత్యేక డ్రైవ్
రేపటి నుంచి వరంగల్‌లో ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రం
ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల బాధితులకు ఇక్కడే పరిశీలన
బాండ్లు, నగదు రశీదులు, ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచన
అసలు బాండ్ తిరిగి తీసుకోవచ్చు
అసలు బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని సీఐడీ స్పష్టం చేసింది. పరిశీలన కోసమే ఒరిజినల్ బాండ్లను చూపించాలి. వాటి కలర్ జిరాక్స్ ప్రతులను సంతకం చేసి సమర్పించాలి. అధికారులు స్వీకరించిన పత్రాలకు రశీదు ఇస్తారు. ఈ ప్రక్రియ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. బాధితులు తమకు కేటాయించిన తేదీల్లోనే హాజరుకావాలని సూచించారు. అసలైన ఖాతాదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా రోజుకు సుమారు 250 మంది ఖాతాదారుల పత్రాలను పరిశీలించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జూలై 30 వరకు కొనసాగనుంది.
బాధితులు గుర్తుంచుకోవాల్సినవి..
అంశం వివరాలు
ప్రారంభ తేదీ ఈనెల 25
కేంద్రం వరంగల్ పోలీస్
హెడ్‌క్వార్టర్స్‌లోని
రాణి రుద్రమదేవి హాల్
సమయం ఉదయం 10 నుంచి
సాయంత్రం 5 వరకు
ఇన్చార్జ్ ఈ.హరికృష్ణ, ఐఓపీ
సంప్రదింపు 87126 85137
చివరి తేదీ 2027 జూలై 30
కేటాయించిన తేదీల్లో హాజరుకావాలి
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా బాండ్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 25వ తేదీ నుంచి బాండ్ల పరిశీలన ప్రారంభమవుతుంది. ఆయా మండలాలలకు కేటాయించిన తేదీల్లోనే పరిశీలన కేంద్రానికి హాజరుకావాలి. తద్వారా ఎలాంటి రద్దీ, అసౌకర్యం లేకుండా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది.అన్ని పత్రాలు తీసుకురావాలి. – సీపీ ఎన్.శ్వేత


