40రోజులు దాటినా సర్టిఫికెట్‌ మంజూరులో జాప్యం | - | Sakshi
Sakshi News home page

40రోజులు దాటినా సర్టిఫికెట్‌ మంజూరులో జాప్యం

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌: దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరుతాయి. శారీరక, మానసిక, ఇతర అంగవైకల్యాలను నిర్ధారించేందుకు సదరం క్యాంపులు పెడతారు. కదలలేని పరిస్థితిలో ఉన్నా.. క్యాంపునకు తప్పనిసరిగా హాజరు కావాలి. వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రతీ వారం క్యాంపులు పెట్టాలని, త్వరగా సర్టిఫికెట్లు జారీ చేయాలని జిల్లా అధికారులు పదే పదే చెబుతున్నారు. అయితే క్యాంపులు సక్రమంగా నిర్వహిస్తున్నా.. సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు నెలల తరబడి తిప్పుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

డాక్టర్లు ఉండడం లేదని సాకు..

సదరం సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు క్యాంపునకు హాజరైన వారిని డాక్టర్‌ పరీక్షిస్తారు. ఎంతశాతం అంగవైకల్యం ఉందని గుర్తించి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు పంపిస్తారు. అక్కడ సర్టిఫికెట్లు పరిశీలించి, స్కాన్‌ చేసి తిరిగి జిల్లా ఏరియా ఆస్పత్రికి పంపిస్తారు. ఇక్కడ ముగ్గురు డాక్టర్లతో సంతకాలు చేయించి దివ్యాంగులకు మెసేజ్‌, ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చి సర్టిఫికెట్‌ అందజేస్తారు. కానీ కొద్దిరోజులుగా సర్టిఫికెట్లు స్కాన్‌ చేయలేదని, డీఆర్‌డీఏ కార్యాలయంలో ఆలస్యం అవుతుందని మరికొద్దిరోజులు, డాక్టర్లు సంతకం చేయడం లేదని ఇంకొన్నిరోజులు జాప్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఆయనను కలిస్తే వెంటనే సర్టిఫికెట్‌..

జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఉద్యోగి కావాలనే సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్‌ పరీక్షకు ముందు, పరీక్ష తర్వాత సదరు ఉద్యోగిని కలిస్తే అనుకున్న పర్సంటేజీ వస్తుంది. సరైన సమయానికి సర్టిఫికెట్‌ వస్తుందనే చర్చ. ఆ ఉద్యోగికి డీఆర్‌డీఏలోని ఉద్యోగులు, పలువురు డాక్టర్లు మద్దతుగా ఉంటారని, అందుకోసమే ఆయన చెప్పిందే వేదం అన్నట్లు ఉందని చర్చ జరుగుతోంది.

సర్టిఫికెట్‌ వస్తేనే..

చాలాకాలం తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. దివ్యాంగులు, వితంతు, గీత, నేత, ఫైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ధరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించారు. అయితే మిగిలిన వారి విషయంలో ఇప్పటికే స్పష్టత రాగా.. దివ్యాంగుల విషయంలో సర్టిఫికెట్‌ ఉంటేనే పింఛన్‌ మంజూరు అవుతుందని అధికారులు చెబుతున్నారు. సదరం క్యాంపునకు హాజరై నెలలు గడిచినా.. సర్టిఫికెట్‌ రాకపోవడంతో కొత్త పింఛన్‌ రాకుండా పోతుందేమో అని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సదరం క్యాంపునకు హాజరైన వారికి త్వరగా సర్టిఫికెట్లు అందజేయాలని కోరుతున్నారు.

ధ్రువీకరణ పత్రం వస్తేనే దివ్యాంగ పింఛన్‌ అప్రూవల్‌

కార్యాలయం చుట్టూ బాధితుల ప్రదక్షిణ

నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న

అధికారులు

‘జిల్లాలోని ఓ మండల కేంద్రానికి చెందిన దివ్యాంగులు 40 రోజుల క్రితం సదరం క్యాంపునకు హాజరయ్యారు. పరీక్షించిన డాక్టర్లు మీకు సర్టిఫికెట్‌ వస్తుంది.. ఇంటికి వెళ్లండి ..మీకు మెసేజ్‌ వస్తుందని చెప్పారు. ఈక్రమంలో నూతన పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. అధికారులు విచారణకు వచ్చారు. అయితే మీరు దివ్యాంగులే, కానీ సర్టిఫికెట్‌ కావాలి. సర్టిఫికెట్‌ చూపిస్తేనే పింఛన్‌ అప్రూవల్‌ చేస్తాం. త్వరగా తెచ్చుకోండి.. అప్పటి వరకు హోల్డ్‌లో పెడతామని చెప్పారు. దీంతో సర్టిఫికెట్‌ ఎప్పుడు వస్తుందో అని బాధితులు కార్యాల యం చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement