సాక్షి, మహబూబాబాద్: ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విధులకు హాజరు కాకుండా.. డుమ్మా కొడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా.. అటు సెలవులు పెట్టకుండా.. ఇటు విధులకు హాజరు కాకుండా.. ఉన్న వారిని గుర్తించి కారణం తెలపాలని నోటీసులు జారీ చేశారు. సరైన కారణం తెలపని వారిపై వేతనం కోతతోపాటు, ఇతర చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
337 మందికి షొకాజ్ నోటీసులు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ఉపాధ్యాయులు సమయపాలన, హాజరును లెక్కించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి కొందరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతీరోజు ఉపాధ్యాయుల హాజరుపై కలెక్టర్ దృష్టి పెట్టారు. గత నెల 30వ తేదీన సాధారణ గైర్హాజరు కన్నా ఎక్కువ మంది ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు వేసుకోకపోవడంపై కలెక్టర్ ఆగ్రహించినట్లు తెలిసింది.
సెలవు పెట్టకుండా..
జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 766 ఉన్నాయి. పాఠశాలల్లో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు కలిపి మొత్తం 4,197 మంది పనిచేస్తున్నారు. అయితే ఇందులో మారుమూల ప్రాంతాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లోని ఏజెన్సీల్లో సెల్ సిగ్నల్ రాని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, వివిధ కారణాలతో రిజిస్టేషన్ కానివారు 13 మంది ఉన్నారు. మిగిలిన 4,184 ఉపాధ్యాయులు రోజూ విధులకు హాజరైనట్లు డిజిటల్ హాజరు వేసుకోవాలి. కానీ, సెప్టెంబర్ 30న 3,487 మంది పంచ్ వేశారు. మిగిలిన వారిలో 360 మంది వివిధ కారణాలతో విధులకు హాజరు కావట్లేదని సెలవు పెట్టారు. మిగిలిన 337 మంది పంచ్ వేయకుండా. సెలవు పెట్టకుండా ఉన్నట్లు గుర్తించారు. వీరు కార ణం తెలపాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
డుమ్మా కొడుతున్నవారిపై నిఘా..
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ వంటి మున్సిపాలిటీ కేంద్రాలకు సమీపంలో ఉన్న పాఠశాలల్లో పనిచేసే వారిలో కొందరు ఉదయం స్కూల్‌కు వెళ్లి ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేసుకుని.. తిరిగి వచ్చి తమ పనులు, వ్యాపారాలు చేసుకొని తిరిగి సాయంత్రం పాఠశాలకు వెళ్లి ఔట్ పంచ్ వేసి వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈవిషయంపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. అధికారుల పర్యవేక్షణ లోపం, పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండడం లేదన్న విషయం తెలిసినా కొందరు అధికారులు పట్టించుకోకపోవడం వంటి ఘటనలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆకస్మిక తనిఖీలు, అధికారులను పాఠశాలలకు పంపి అటెండెన్స్ వేసుకుని వస్తున్నవారిని గుర్తించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
చర్యలకు రంగం సిద్ధం
సెప్టెంబర్ 30న ఉపాధ్యాయుల హాజరు పరిశీలించిన కలెక్టర్ ఆదేశాల మేరకు గైర్హాజరైన ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకుంటున్నాం. కారణం లేకుండా విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకునేందుకు ఎంఈఓల నుంచి వివరణ తీసుకొని చర్యలు తీసుకుంటాం. పంచ్ వేసి విధుల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెట్టాం.
– మందుల శ్రీరాములు, ఇన్‌చార్జ్ డీఈఓ
ఉపాధ్యాయుల డుమ్మాౖపై
కలెక్టర్ సీరియస్
337 మంది ఉపాధ్యాయులకు
షోకాజ్ నోటీసులు
సరైన కారణం తెలపని వారి వేతనం కోతకు రంగం సిద్ధం
ఎఫ్‌ఆర్‌ఎస్ ఇచ్చి విధులు నిర్వహించని వారిపై నిఘా
కలెక్టర్ ఆరా..
ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆరా తీస్తున్నారు. సెప్టెంబర్ 30న హాజరు పరిశీలించి పంచ్ వేయని 337 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజున జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉపాధ్యాయుల గైర్హాజరుకు కారణం ఏంటని అడిగి తెలుసుకున్నారు. అయితే ఇందులో కొందరు టైమింగ్‌కు వెళ్లకపోవడంతో పంచ్ వేయలేదని చెప్పగా.. మరికొందరు కావాలనే విధులకు హాజరు కాలేదని స్పష్టమైంది. విధులపట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఎంఈఓలను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. అయితే సరైన కారణం తెలిపిన వారు మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని చెబుతూ.. సరైన కారణం తెలపని వారిపై ఒకరోజు వేతనం కట్ చేయడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కొందరు ఎంఈఓలు తెలిపినట్లు సమాచారం. కలెక్టర్ సెలవులో ఉన్నందున తిరిగి రాగానే చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.


