పోటా.. పోటీ | - | Sakshi
Sakshi News home page

పోటా.. పోటీ

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

● నేడు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

● మహబూబాబాద్‌, తొర్రూరు డిపోల్లో

సందడి

● ఏర్పాట్లు పూర్తి చేసిన కార్మికశాఖ

సాక్షి, మహబూబాబాద్‌: పదేళ్ల తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు డిపోల పరిధిలో జరిగే ఈ ఎన్నికల కోసం కార్మికులు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వారం రోజులుగా చేసిన ప్రచారానికి శుక్రవారం తెరపడనుంది. అయితే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

డిపోల వద్ద సందడి

డిపోలు, జిల్లా, రాష్ట్రస్థాయిలో కార్మిక సంఘాలకు గుర్తింపునిచ్చే ఎన్నికలు కావడంతో జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు డిపోల పరిధిలో ఎన్నికల సందడి తారస్థాయికి చేరుకుంది. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌, ఆర్టీజెన్సీ కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు కలిగి ఉండడంతో ప్రతీ ఓటు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే రెండు డిపోల పరిధిలో టీడబ్ల్యూయూ అశ్వాథ్థామ రెడ్డి వర్గం, ఎంప్లాయీస్‌ యూనియన్‌ పోటీ పడుతున్నాయి. టీడబ్ల్యూయూ కూటమికి ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఐఎన్‌టీయూసీ, ఎస్‌డబ్ల్యూయూ మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఎంప్లాయీస్‌ కూటమిలో ఎన్‌ఎంయూ, టీఎంయూ (థామస్‌ రెడ్డి వర్గం), ఏఐటీయూసీ కార్మిక సంఘాల మద్దతు ఉంది. అయితే ఎవ్వరికి వారుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, హక్కుల సాధన, పెండింగ్‌ వేతనాలు, రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌ విడుదలపై తమ సంఘం కృషి చేస్తుందని ప్రచారం చేసుకున్నారు. అయితే, మహబూబాబాద్‌, తొర్రూరు రెండు డిపోల పరిధిలో కమ్యూనిస్టుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో.. అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఎలా పనిచేస్తుందో అనే విషయంపై చర్చ జరుగుతోంది. ప్రతీ కార్మికుడు ఏదో ఒక యూనియన్‌లో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఓట్లను చీల్చి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గురువారం రాత్రి అన్ని సంఘాలు రకరకాల ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

సర్వం సిద్ధం

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా కార్మికశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని మహబూబాబాద్‌ డిపో పరిధిలో 218 ఓట్లు, తొర్రూరు డిపో పరిధిలో 302 ఓట్లు ఉండగా.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు జిల్లా కార్మికశాఖ అధికారి క్రాంతికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement