నెహ్రూసెంటర్: దేశంలోని దళిత, మైనార్టీల ఓట్లను తొలగించేందుకు, ఓటు హక్కును లేకుండా చేసేందుకు కేంద్రం, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ కుట్రలు చేస్తున్నారని ముస్లిం మత పెద్ద ముఫ్తి అలంగీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్, ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అహ్మద్‌ఖాన్ ఆరోపించారు. సీఈసీను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఫకీర్, ఆసిఫ్, ఇస్మాయిల్, సయీద్, అహ్మద్ రిజ్వీ, అక్బర్, ఖయ్యూం, సయ్యద్‌జాకీర్, మహబూబ్‌పాషా, జమీల్, సాధిఖ్, గౌస్, షేక్ ఉస్మాన్, కరాటే ఖాజా, కలీమ్, ఇమామ్, హఫీజ్, అక్బర్, యూసుఫ్, ఖాజా, జాకీర్, జావిద్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్‌ను తనిఖీ చేసిన డీడీఎం రాజు
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ (డీడీఎం) ఆజ్మీరా రాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు మార్కెట్ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరీశీలించారు. ఎప్పటికప్పుడు రికార్డుల్లో సంబంధిత వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మార్కెట్‌లోని వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లను పరీశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసరాజు, వరంగల్ మార్కెట్ సూపర్‌వైజర్ మురళీయాదవ్, కేసముద్రం మార్కెట్ కార్యదర్శి రాజేంద్రప్రసా ద్, సూపర్‌వైజర్ వివేక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా స్థాయి
పోటీలకు అఖిరానందన్
మహబూబాబాద్ అర్బన్: ఇటీవల ములుగు జిల్లా జాకారం పోలీస్ శిక్షణ సెంటర్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–14 క్రికెట్ ఎంపికలో గూడురు గ్రామానికి చెందిన గుగులోతు అఖిరానందన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్జీఎఫ్ క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అజయ్‌సారధిరెడ్డి గురువారం తెలిపారు. అఖిరానందన్‌కు క్రికెట్ కోచ్‌లు కుమార్, సాద్విత్‌రెడ్డి, శ్రావణ్ శుభాకాంక్షలు తెలిపారు.
బెంబేలెత్తిస్తున్న శునకాలు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో కుక్కల దాడులతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో బుధవారం రాత్రి పిచ్చి కుక్క దాడిలో 12 మంది గాయపడ్డారు. అదేవిధంగా మంగళవారం ఏడుగురు గాయపడ్డారు. వీరు స్థానిక పీహెచ్‌సీ, పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో, ఖమ్మంలో చికిత్స చేయించుకున్నారు. కాగా, డోర్నకల్‌లో స్థానికులపై దాడి చేసిన కుక్కను గురువారం మున్సిపాలిటీ సిబ్బంది బంధించారు. డోర్నకల్‌లో గాంధీ సెంటర్, బైపాస్ రోడ్డులోని చికెన్, మటన్ దుకాణాల వద్ద కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్థానికులపై దాడులకు దిగుతున్నాయి. అదేవిధంగా కోతులు సైతం ఇళ్లు పీకి పందిరి వేస్తున్నాయని, అధికారులు స్పందించి కుక్కలు, కోతుల బెడద నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
బీఫార్మసీ కళాశాలలో
స్పాట్ కౌన్సెలింగ్
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి అనంతారంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బీఫార్మసీ మహిళా గురుకుల కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 10వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.హేమలత గురువారం తెలిపారు. అర్హులైన బాలికలు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో శనివారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు అనంతారం బీ ఫార్మసీ కళాశాలను సంప్రదించాలని సూచించారు.


