● సర్వర్ పనిచేయకపోవడంతో పడిగాపులు కాసిన రైతులు
● ఆగ్రహంతో అధికారుల నిలదీత
● మ్యాన్యువల్‌గా ధరలు రాసిచ్చి కాంటాలు
మహబూబాబాద్ రూరల్: పండించిన పంటల్ని అమ్ముకుందామని తీసుకొచ్చిన రైతుకు కష్టాలు తప్పలేదు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం రైతులు మక్కలు, ధాన్యం, పెసర, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువచ్చారు. అమనగల్, రెడ్యాల, జంగిలిగొండ, పర్వతగిరి, రోటిబండ తండా, ముడుపుగల్ గ్రామాలతో పాటు కురవి, కేసముద్రం మండలంలోని పలు గ్రామాల రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకొచ్చి రాశులుగా పోశారు. ఉదయం 9.30 గంటలకు ఈనామ్ ఆన్లైన్ సర్వర్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 4.30 గంటలకు ఓపెన్ అయ్యింది. సాంకేతికలోపం కారణంగా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు యార్డు ప్రాంగణంలో పడిగాపులు కాశారు. రైతులు సమస్యను మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన మార్కెట్ సెక్రటరీ వెంకటేశ్వర్లుతో మాట్లాడి కొనుగోళ్లు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాయంత్రం సమయంలో ఆన్ లైన్ ప్రారంభంకాగానే వ్యాపారులు ధరలు నిర్ణయించడం మొదలుపెట్టగా.. శుక్రవారం ఉదయం వ్యవసాయ ఉత్పత్తుల కాంటాలు జరుగుతాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
రైతుల ఆందోళన
కేసముద్రం: ఈ నామ్ సర్వర్ డౌన్ కారణంగా వ్యాపారులు వేసిన టెండర్ల నమోదు, విన్నర్‌లిస్టు విడుదల కాకపోవడంతో కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజామునే వచ్చి, లాట్ ఐడీ నమోదు చేసుకుని రాశులుగా పోసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన సరుకులకు, వ్యాపారులు ఈ–నామ్ విధానంలో టెండర్లు వేసే క్రమంలో సర్వర్ ఎర్రర్ వస్తుండడంతో, టెండర్లు నమోదు కాలేదు. మధ్యాహ్న సమయంలో విన్నర్‌లిస్టు విడుదల కావాల్సి ఉండగా, సాయంత్రం అయినప్పటికీ టెండర్లు నమోదు కాలేదు. విన్నర్‌లిస్టు రాలేదు. రైతులు ఆగ్రహనికి గురై, మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. చివరకు వ్యాపారులు లెటర్‌ప్యాడ్‌లపై వేసిన ధరలను తీసుకుని, వాటిల్లో ఎక్కువ పడిన ధరలను మ్యాన్యువల్‌గా రాసి రైతులకు ఇచ్చారు. అనంతరం కాంటాలను ప్రారంభించగా, రాత్రి వరకు తొలకాలు జరిగాయి. దీంతో రాత్రి వరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది.
రైతుల కష్టాలు పట్టించుకోవట్లేదు..
పంటలు అమ్ముకునేందుకు మార్కెట్‌కు వస్తే రైతులు పడుతున్న కష్టాలను మార్కెట్ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవట్లేదు. మొక్కజొన్నలను ఉదయం ఐదున్నర గంటలకు తీసుకొస్తే సాయంత్రం వరకు కూడా ఈనాం సర్వర్ పనిచేయలేదు. మాన్యువల్ పద్ధతి ద్వారా కొనుగోలు చేయాలని రైతులు కోరినప్పటికీ పట్టించుకోలేదు.
– జేరిపోతుల ఉపేందర్, రైతు, ముడుపుగల్


