7, 8, 9 తేదీల్లో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
నెల్లికుదురు: ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ఈ నెల 11న నిర్వహించే శ్రీముత్యాలమ్మతల్లి బోనాల పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో ఈ నెల 7, 8, 9తేదీల్లో ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు చిన్ననాగారం క్రీడా నిర్వాహకులు మంగళవా రం తెలిపారు. ఎంట్రీ ఫీజు రూ.500గా నిర్లయించినట్లు తెలిపారు. పోటీలో పాల్గొనాలనుకునే క్రీడాకారులు 99512 46071, 77025 59276, 90591 04094 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: అంబేడ్కర్ ఓవర్సిస్ విదేశీవిద్యానిధి పథకానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వం అర్హులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తుందని తెలిపారు. విద్యార్థుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకుండా ఉండాలని, టోఫెల్.. ఇతర విభాగాల్లో, పాస్‌పోర్ట్, వీసా అర్హత కలిగి ఉండాలని, ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. www.telanganaepss.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
డిజిటల్ కీతో
అక్రమ సర్టిఫికెట్ల జారీ?
బయ్యారం: మండలంలోని నాలుగు పంచాయతీల కార్యదర్శులకు సంబంధించిన డిజిటల్ కీ లతో అక్రమ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను డిజిటల్ కీ లు పొందిన వ్యక్తులు సుమారు 100 వరకు అక్రమంగా జారీ చేసినట్లు సమాచారం. మంగళవారం ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన ఆయా పంచాయతీల కార్యదర్శులు.. ఎంపీడీఓ, ఎంపీఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై మంగళవారం రాత్రి ఎంపీఓతోపాటు పంచాయతీ కార్యదర్శులు పోలీస్ అధికారులను సంప్రదించగా.. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. ఫిర్యాదు అనంతరం పోలీసుల విచారణలో పూర్తి వివరాలు బహిర్గతం కానున్నాయి.
యాప్ ద్వారా రైతులకు
సకాలంలో యూరియా
మరిపెడ: యాప్ ద్వారా రైతులందరికీ సకాలంలో యూరియా అందుతుందని జిల్లా వ్యవసాయ అధికారి బి.సరిత అన్నారు. మరిపెడ పట్టణ కేంద్రంలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం డీఏఓ పరిశీలించారు. ప్రస్తుతం యూరియా పరిస్థితిపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తుండడంతో రైతులకు సమయం ఆదా అవుతుందన్నారు. యూరియా పంపిణీ కోసం రూపొందించిన యాప్‌ను అన్నదాతలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ విజయచంద్ర, మరిపెడ ఏఓ బోడ వీరసింగ్, డీలర్లు కాలం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్, రైతులు పాల్గొన్నారు.
నేడు తిరుగువారం పండుగ
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి దూప దీపాలు వెలిగించి యాటను నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
7, 8, 9 తేదీల్లో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు


