దోస్త్ కటీఫ్
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● స్నేహపూర్వక పొత్తుపై బీఆర్‌ఎస్, సీపీఐ మంతనాలు
● నాలుగు స్థానాలు తీసుకొని సీపీఎం కాంగ్రెస్‌తో జత
● చివరి నిమిషం వరకు ఉత్కంఠ
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు రెబల్స్ బెడద
● ఫలించని నాయకుల ప్రయత్నాలు
రెబల్స్ ఇలా..
● మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్‌ఎస్ నుంకి ఆరుగురు రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
● డోర్నకల్ మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
● మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు రెబల్ అభ్యర్థులు పోటీలో చేస్తున్నారు.
● తొర్రూరు మున్సిపాలిటీలో16 వార్డులు ఉన్నాయి. ఇందులో బీఆర్‌ఎస్ నుంచి రెండు వార్డుల్లో రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
● కేసముద్రం మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, బీఆర్‌ఎస్‌లో ఇద్దరు రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మానుకోటలో కాంగ్రెస్, సీపీఐ మధ్య వికటించిన పొత్తు
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే ఆఖరు నిమిషం వరకు అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు కాంగ్రెస్, సీపీఐ పొత్తు వికటించడం. మరోవైపు టికెట్ ఆశించిన వారికి పార్టీల బీ ఫామ్ రాకపోవడం.. వారిని బుజ్జగించే పనిలో నాయకులు ఉండడం.. అదే సందర్భంలో సీపీఐ నాయకులు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
సీపీఐ, బీఆర్‌ఎస్ స్నేహపూర్వక పొత్తు
కాంగ్రెస్ పార్టీతో పొత్తు వికటించిన విషయం తెలియడంతో బీఆర్‌ఎస్ నాయకులు సీపీఐ నాయకులను కలిశారు. బీఆర్‌ఎస్ మహబూబాబాద్ ము న్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత.. సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి విజయ్ సారథి, రాష్ట్ర నాయకుడు అజయ్ సారథితోపాటు ఇతర పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని.. ఇందుకోసం పార్టీల వారీగా గెలుపు అవకాశాలు ఉన్నచోట్ల స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.
నాలుగు వార్డుల్లో సీపీఎంతో పొత్తు
కాంగ్రెస్, సీపీఎం మానుకోట మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే ఐదు వార్డులు ఇస్తారని ముందుగా భావించి మున్సిపాలిటీలోని నాల్గవ వార్డులో సీపీఎం అభ్యర్థి నామినేషన్ వేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీలో ఉండటం.. చివరకు కాంగ్రెస్ బీ ఫామ్ ఇవ్వడంతో అక్కడ పొత్తు కుదరలేదు. బీఆర్‌ఎస్, ఇతర పార్టీలు, స్వంత్ర అభ్యర్థులతోపాటు సీపీఎం, కాంగ్రెస్ ఇరుపార్టీల అభ్యర్థులు పోటీలో నిలిచారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు రెబల్స్ బెడద
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన వారికి సర్దిచెప్పేందుకు నాయకులు ప్రయత్నించగా.. వారు ఒప్పుకోలేదు. అదే విధంగా బీఆర్‌ఎస్ రెబల్స్‌ను నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఇన్‌చార్జ్ వినయ్ భాస్కర్ ప్రయత్నం చేయగా.. కొందరు విత్‌డ్రా చేసుకోగా మరికొందరు పోటీలో ఉన్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ పొత్తు మున్సిపాలిటీ ఎన్నికల్లో వికటించింది. మొదటి నుంచి ఇరుపార్టీల మధ్య పొత్తు ఉంటుందని అందరూ భావించారు. అందుకు అనుగుణంగా వార్డు సభ్యులను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే సీపీఐ 13 స్థానాలు అడగ్గా.. కాంగ్రెస్ ఒప్పుకోలేదు. సోమవారం జరిపి న మంతనాల్లో ఐదు వార్డులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమ ప్రకటించారు. అయితే ముందుగా చెప్పినట్లు ఆరు వార్డులు ఇవ్వాలని సీపీఐ పట్టుపట్టింది. దీంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదురకపోవడంతో వేర్వేరుగానే నామినేషన్లు వేశారు. నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సీపీఐ నాయకులు ఆందోళన చేశారు.
దోస్త్ కటీఫ్
దోస్త్ కటీఫ్


