మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ కుంభమేళా మే డారం మహాజాతరను దొంగల ముఠాలు వదల్లే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వచ్చి మేడారం జాతరలో హల్చల్ చేసిన దొంగల వివరాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా జంప న్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభ్యమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జాతరలో పేస్ రికగ్నైజేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట ముఠాలకు చెందిన దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్‌వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది.
సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు...
సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే భక్తులపై పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) పది చోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ పేస్ రికగ్నైజేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో పెట్టారు. గతంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్ప డిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ఫొటోలను కంప్యూటర్‌లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్‌వేర్‌తో అను సంధానం చేయడంతో కంప్యూటర్‌లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అమర్చిన పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరిగిన నాలుగు రోజుల్లో పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్‌లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్‌లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
మేడారంలో మహారాష్ట్ర,
నంద్యాల దొంగలు
ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్‌వేర్
‘ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం’తో దొరికిన ఆచూకీ
70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ


