అవగాహనతోనే కేన్సర్ నివారణ
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహార కల్తీ వంటి కారణాలతో విస్తరిస్తున్న కేన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కేన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీసుకునే ఆహారంపై అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అన్నం, ఉప్మా వంటి పదార్థాలు అడుగు భాగంలో మాడిపోయినప్పుడు వాటిని తినకూడదన్నారు. మొక్కజొన్న కంకులను నల్లగా కాల్చుకుని తినడం ఆరోగ్యానికి హానికరమని, ఇలా మాడిపోయిన పదార్థాల్లో కర్బన జనిత రసాయనాలు ఉంటాయని ఇవి కేన్సర్‌కు కారకాలుగా మారుతాయని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, డబ్బాల్లో వేడి పదార్థాలు లేదా పానీయాలు ఉంచి వినియోగించొద్దన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఏ.కృష్ణతేజ్, ప్రభుత్వాసుపత్రి డాక్టర్ రవీందర్, పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, ప్రభుత్వ న్యాయవాదులు తోర్నాల నగేష్ కుమార్, సునీత, డీఎస్పీ తిరుపతిరావు, టౌన్, రూరల్ సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య న్యాయశాఖ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


