విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా..
విద్యారణ్యపురి: పీఎంశ్రీ స్కూళ్లలో విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు యోగా, క్రీడలపై ఆసక్తిని పెంచేలా 2025–2026 విద్యాసంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. ఒక్కో పీఎంశ్రీ స్కూల్‌కు రూ. 83,067 చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లోని పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రంలోని 794 పీఎంశ్రీ పాఠశాలల కోసం నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్,సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.
గెస్ట్, పార్ట్ టైంగా యోగా టీచర్లు,
స్పోర్ట్స్ కోచ్‌ల నియామకం
పీఎంశ్రీ స్కూళ్లలో క్రీడాకార్యకలాపాలను బలో పేతం చేయడం, యోగాను ప్రోత్సహించడం ద్వా రా విద్యార్థుల్లో ఆరోగ్యకర జీవన శైలిని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను పీఎంశ్రీస్కూళ్లలో గెస్ట్, పార్ట్‌టైం యోగా టీచర్లను, స్పోర్ట్స్ కోచ్‌లను నియమించుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలకు మంజూరైన బడ్జెట్ నిధులలో పాఠశాల హెచ్‌ఎంలు యోగా, ఏదైనా క్రీడావిభాగంలో నిపుణులైన పార్ట్‌టైంగా ఆయా యోగా, స్పోర్ట్స్‌కోచ్‌ల సేవలను వినియోగించుకోవచ్చు.
నిబంధనలు..
ఈ గెస్ట్ కోచ్‌లకు ఎలాంటి అధికారిక నియామక పత్రాలు జారీచేయొద్దు. వారు పాఠశాల రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిన అవసరం లేదు. జిల్లాల స్థాయిలో నిధులు విడుదల చేశారు. డీడీఓ కోడ్ ఉన్న పీఎంశ్రీ స్కూళ్ల హెచ్‌ఎంలు నేరుగా నిధులను స్వీకరించి ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. డీడీఓ కోడ్‌లేని పీఎంశ్రీ స్కూళ్లకు సంబంధించిన నిధులను జిల్లా డీఈఓలు పర్యవేక్షణ చేస్తారు.
పీఎంశ్రీ స్కూళ్లలో యోగా తరగతులు
ఒక్కో స్కూల్‌కు రూ.83,067 నిధులు
యోగా, క్రీడాకోచ్‌ల నియామకానికి ఉత్తర్వులు


