అతివేగానికి నిండు ప్రాణం బలి
మరిపెడ రూరల్ : అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. శుభకార్యంలో క్యాటరింగ్ చేసేందుకు బొలెరో వాహనంలో 25 మంది యువకులు వెళ్తుండగా అతివేగంతో ఆ వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్‌పురం శివారు పత్తి మిల్లు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. మరిపెడ మండలంలోని లచ్చతండా, సీరోలు మండలం ఉప్పరగూడెం గ్రామాలకు చెందిన 25 మంది యువకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి క్యాటరింగ్ చేసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారి మలుపు వద్ద అతివేగంతో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఉప్పరగూడెం గ్రామ పరిధిలోని తండాకు చెందిన మాలోత్ పవన్ (20), మాలోత్ సందీప్, బానోత్ ఈశ్వర్, మరిపెడ మండలం లచ్చతండాకు చెందిన గుగులోత్ లక్ష్మణ్ (డ్రైవర్), గుగులోత్ కుమార్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాలోత్ పవన్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి మానసిక దివ్యాంగుడు కాగా కుటుంబ పోషణ నిమిత్తం పవన్ వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటున్నాడు. కానీ శనివారం మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనికి వెళ్తుండగా ఘటన జరిగి పవన్ మృత్యువాత పడ్డాడని బంధువులు రోదిస్తూ తెలిపారు.
అదుపు తప్పి బొలెరో వాహనం బోల్తా
చికిత్స పొందుతూ యువకుడి మృతి,
9 మందికి తీవ్ర గాయాలు
బుర్హాన్‌పురం శివారులో ఘటన
అతివేగానికి నిండు ప్రాణం బలి


