15 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్
డోర్నకల్: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ 15 గంటలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాలతో గత బుధవారం డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో ట్రాక్ నీట మునగడంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్ నుంచి వెనుకకు వెళ్లి నడికుడి మీదుగా ఆలస్యంగా తిరుపతికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు ఆదిలాబాద్‌కు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో గురువారం సాయంత్రం 3.19 గంటలకు రైలు డోర్నకల్‌కు రావాల్సి ఉండగా సుమారు 15 గంటల ఆలస్యంగా శుక్రవారం ఉదయం 6.30లకు చేరుకుంది.
రైతులు పంటలు నమోదు చేసుకోవాలి
బయ్యారం: వానాకాలంలో వరిసాగు చేసిన రైతులు ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఏఈఓ ద్వారా పంటలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల సూచించారు. మండలంలోని గంధంపల్లి–కొత్తపేట సమీపంలోని వరి పొలాలను శుక్రవారం ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ రాజు, ఏఈఓలు నాగరాజు, అఖిల్, రైతులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని 22 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల బోధన కోసం ఉపాధ్యాయ, ఆయా పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పి.దక్షిణామూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పోస్టుకు కనీస ఉత్తీర్ణత కలిగి ఉండాలని, టీచర్ పోస్టుకు ఇంటర్, టీటీసీ అర్హత కలిగి ఉండాలన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. ఆయాకు నెలకు రూ.6 వేలు, టీచర్‌కు రూ. 8 వేల వేతనం అందిస్తామన్నారు. ఈ వేతనం పాఠశాలలు కొనసాగిన పది నెలలు మాత్రమే ఉంటుందన్నారు. దరఖాస్తులు నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు మండల, విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
తొర్రూరు: కార్మికుల హక్కులు కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకువస్తోందని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు అన్నారు. డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ భిక్షపతితో కలిసి విశ్వేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలన్నారు. ఏఐటీయూసీ 9 దశాబ్దాలుగా కార్మికుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బందు మహేందర్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల ప్రభాకర్, నాయకులు ఘనపురం లక్ష్మణ్, పేరబోయిన కిరణ్, వెంకన్న, వీరన్న, చంద్రయ్య పాల్గొన్నారు.
15 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్
15 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్


