వరద నష్టం రూ.200కోట్లు
సాక్షి, మహబూబాబాద్: మోంథా తుపానుతో జిల్లా అతలాకుతలమైంది. చేతికొచ్చిన పంటలు నీట ము నిగాయి. చెరువులు, కాల్వలు తెగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఈ నష్టం రూ.200కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అయితే కొండంత నష్టం జరిగితే ప్రభుత్వ అధికారులు మాత్రం తక్కు వ అంచనాలు వేస్తున్నారని, రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
తెగిన చెరువులు, రోడ్లు..
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలోని 159 చెరువులు కుంటలు తెగిపోయాయి. వాటిని తాత్కాలిక మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండేలా చేశారు. మరికొన్ని చెరువులు మరమ్మతులకు నోచుకోలేదు. మోంథా తుపానుతో జిల్లాలోని చిన్ననాగారం, మునిగలవీడు, బలపాల ప్రాంతంలో కాల్వలు తెగిపోయాయి. కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలోని బర్లవానిచెరువు, పెరుమాండ్ల సంకీస రెడ్డి చెరువు, ఉయ్యాలవాడ ఊర చెరువు తెగిపోయాయి. డోర్నకల్ మండలం రావిగూడెం కొత్తకుంట, కురవి మండలం నేరడ పెద్ద చెరువు, మరిపెడ మండలం నీలికుర్తి గ్రామంలోని పెద్ద సముద్రం చెరువులకు గండ్లుపడ్డాయి. ఇలా జిల్లాలో మొత్తం 11 చెరువులు, కాల్వలు వర్షంతో దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతు చేసేందుకు రూ. 12.3లక్షలు, శాశ్వత పనులు చేసేందుకు 63.5లక్షల ఖర్చు అవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనాలు వేశారు. అదే విధంగా జిల్లాలో ఇప్పటికే ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతల మయంగా ఉన్నాయి. గత ఏడాది నుంచి వీటిని మరమ్మతులు చేసిన వారు లేరు. ప్యాచ్ వర్క్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో పనులు చేసినా.. అవి ౖపైపెనే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలకు జిల్లాలోని రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నిచోట్ల ఇంకా ప్రవాహం తగ్గకపోవడం, ఇంకా అంచనాలు వేయలేదు.
దెబ్బతిన్న పంటలు..
వానాకాలం సీజన్‌లో 3,59,774 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా 2.10లక్షల ఎకరాల్లో వరి, 64వేల ఎకరాల్లో మొక్కజొన్న, 82వేల ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. ఇందులో మోంథా తుపానుతో సుమారు లక్ష ఎకరాలకుపైగా పంట నష్టం జరిగిందని రైతు సంఘాల నాయకులు చెబు తున్నారు. కానీ, అధికారులు మాత్రం 10,422 మంది రైతులు సాగు చేసిన 16,617 ఎకరాల వరి, 35మంది రైతుల 65 ఎకరాల మొక్కజొన్న, 4,807 మంది రైతుల 8,782 ఎకరాల పత్తి, 350 మంది రైతులు సాగుచేసిన 565 ఎకరాల్లో మిర్చి.. మొత్తంగా 15,614 మంది రైతులు సాగుచేసిన 26,029 ఎకరాల్లో మాత్రమే పంటలు నీట మునిగాయని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ఈ నష్టం ఎక్కువగా ఉందని మొత్తం రూ.150కోట్ల మేరకు పంటనష్టం జరిగిందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
నీట మునిగిన పంటలు
తెగిన చెరువులు, రోడ్లు
అంచనాలు తయారు చేస్తున్న అధికారులు


