తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
తొర్రూరు రూరల్: రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం కృష్ణవేణి తెలిపారు. మండలంలోని నాంచారిమడూరు, వెలికట్ట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. డీఎం కృష్టవేణి మాట్లాడుతూ.. అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే నగదు జమ చేస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్నారు. రైతులు అధైర్యపడొద్దని సూచించారు.


