వరదలో ప్రేమజంట గల్లంతు
జఫర్‌గఢ్ : బైక్‌పై వస్తున్న ప్రేమజంట వరద ఉధృతిలో పడింది. కొట్టుకుపోతున్న క్రమంలో యువకుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణంతో బయటపడగా యువతి గల్లంతు అయ్యింది. ఈ ఘటన బుధవారం రాత్రి జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కోనాయిచలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క అలీసాబ్, పూర్ణ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్‌లోని కోళ్ల ఫామ్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ఫామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన బరిగేల శివకుమార్ పనిచేస్తున్నాడు. అలీసాబ్, పూర్ణ దంపతుల రెండో కుమార్తె శ్రావ్య వరంగల్‌లోని ఓ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతూ ఇదే కళాశాల వద్ద హాస్టల్‌లోనే ఉంటోంది. అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్దకు వస్తున్న క్రమంలో శివకుమార్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో శ్రావ్య.. శివకుమార్‌ను కలిసేందుకు బుధవారం హైదరాబాద్ వెళ్లింది. కాగా, శ్రావ్యను తిరిగి వరంగల్‌లోని హాస్టల్‌లో చేర్చేందుకు సాయంత్రం బైక్‌పై ఇద్దరు బయలుదేరి జఫర్‌గఢ్ మండలం కోనాయిచలం వైపు వస్తున్నారు. అప్పటికే బోల్లమత్తడి కల్వర్టు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా శివకుమార్ చెట్టుకొమ్మల సాయంతో బయటపడ్డాడు. శ్రావ్య గల్లంతు అయ్యింది. గురువారం గల్లంతైన శ్రావ్య ఆచూకీ కోసం వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రామారావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు.


