కంబాలపల్లిలో యువకుడు..
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు వరద ఉధృతిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు జంపన్నవాగు వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) వ్యవసాయం చేసుకుంటూ భార్య స్వరూప, ఇద్దరి కూతుళ్లను పోషించుకుంటున్నాడు. బుధవారం గ్రామంలో తమ బంధువు దశదిన కర్మలు జరిగాయి. ఈకార్యక్రమానికి బయ్యారం మండలం గురిమిళ్లకు చెందిన తన మేనత్త సూరబోయిన మల్లమ్మ హాజరైంది. కార్యక్రమం అనంతరం ఆమెను బైక్‌పై రెడ్యాల నుంచి గురిమిళ్లకు తీసుకెళ్లాడు. రాత్రి గురిమిళ్ల నుంచి రెడ్యాలకు బయలుదేరాడు. ఈ సమయంలో చిన్నవాగు కల్వర్టుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరదను గమనించకుండా వెళ్లి గల్లంతయ్యాడు. దీనిపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చేపట్టగా చిన్న వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


