ఉసురు తీసిన వరద..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘మోంథా’ తుపాను పలువురి ఉసురు తీసింది. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం ఏకధాటిగా భీకరంగా కురిసింది. దీంతో ప్రమాదశాత్తు వరద నీటిలో పడి కొందరు మృతి చెందగా, మరికొందరు ప్రవాహంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకొందరు రోజంత కురిసిన వానకు ఇంటి గోడలు నాని కూలి మీదపడడంతో మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
–సాక్షి నెట్‌వర్క్
వరంగల్: నగరంలోని 14వ డివిజన్ ఎస్‌ఆర్‌నగర్‌లో వరద నీటిలో పడి అడప కృష్ణమూర్తి (65) మృతి చెందాడు. బంధువుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుండడంతో అధికారులు శుభం గార్డెన్స్‌లో సహాయక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఎస్‌ఆర్‌నగర్ వాసులంతా వెళ్లగా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బంధువులు వచ్చి చూడగా కృష్ణమూర్తి నీటిలో పడి మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు కాలనీ వాసులు తెలిపారు.
గోడ కూలి గాజులగట్టులో వృద్ధురాలు ..
గూడూరు: వర్షానికి గోడ కూలి మీదపడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోల రామక్క(80) బుధవారం రాత్రి ఇంట్లో గోడ పక్కన మంచంలో నిద్రిస్తోంది. ఈ సమయంలో వర్షం కురిసి గోడ నానింది. దీంతో గోడ శిథిలాలు ఒక్కసారిగా నిద్రిస్తున్న రామక్కపై పడడంతో మృతి చెందింది. ఈఘటనపై కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. గిరిధర్‌రెడ్డి తెలిపారు.
కొండపర్తిలో మరో వృద్ధురాలు..
ఐనవోలు: భారీ వర్షంతో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గద్దల సూరమ్మ(58) ఒంటరి జీవనం గడుపుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఇంటి(పెంకుటిల్లు) గోడలు తడిశాయి. గురువారం తెల్లవారుజామున మంచంపై నిద్రిస్తున్న సూరమ్మపై పడడంతో ఆమె మృతిచెందింది. కాగా, శిథిలాల కింద ఉన్న సూరమ్మ మృతదేహాన్ని స్థానికులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆత్మకూరులో వ్యక్తి ..
ఆత్మకూరు: భారీ వర్షంతో ఓ వ్యక్తి అస్వస్థకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన దివ్యాంగుడు నాగెల్లి ఆనందం(60)బుధవారం రాత్రంతా వర్షం కురుస్తుండడంతో ఇంటికి వెళ్లకుండా బస్టాండ్ సమీపంలో తలదాచుకున్నాడు.ఈ క్రమంలో చలికి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన బంధువులు గురువారం చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ను పిలిపించగా అప్పటికే మృతిచెందాడు.
కొత్తపల్లిలోకల్వర్టులో పడి వ్యక్తి..
ఎల్కతుర్తి: మొంథా తుపాను ప్రభావంతో బుధవారం కురిసిన వర్షంతో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్రం (58)కాల్వ లో పడి దర్మరణం చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నాగేంద్రం విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా వర్షం ఉధృతి పెరిగింది. కల్వర్టు నీటితో నిండిపోవడంతో దారి కనిపించక అందులోనే పడి మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
ఉసురు తీసిన వరద..
ఉసురు తీసిన వరద..
ఉసురు తీసిన వరద..
ఉసురు తీసిన వరద..


