‘మోంథా’తో మరోసారి ఉలిక్కిపడ్డాం..
మరిపెడ రూరల్: ‘మోంథా’ తుపానుతో మరోసారి ఉలిక్కిపడ్డామని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలోని సీతారాంతండా ముంపు నిర్వాసితులు తెలిపారు. గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి తమకు మరో చోట పునరావాసం కింద ఇళ్లు నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలలోని పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు బ్రిడ్జి సమీపంలో మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ముంపు ప్రాంతమైన సీతారాంతండాలో ఉంటే ఎప్పటికై నా తమ ప్రాణాలు వాగులో కలిసిపోతాయని బోరుమన్నారు. గతేడాది జూన్‌లో వచ్చిన వరదలకు ముంపుకు గురై సర్వం కోల్పోయామన్నారు. దాతల సహకారంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మళ్లీ తుపాన్ వరదలతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. గతేడాది ఆకేరు వాగు వరదకు గురైన తమ తండాను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి తమకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించార న్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించిన తమకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై వీరభద్రరావు, అదనపు ఎస్సై కోటేశ్వర్‌రావు, ఎంపీఓ సోమ్లానాయక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమింపజేశారు.
సీతారాంతండా ముంపు నిర్వాసితులు
ప్రభుత్వ హామీ మేరకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్
365 జాతీయ రహదారిపై
గంటపాటు రాస్తారోకో


