జాతర పనుల్లో నాణ్యత పాటించాలి
● సీఎం ముఖ్యకార్యదర్శి
కె.ఎస్ శ్రీనివాసరాజు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సీఎం ముఖ్యకార్యదర్శి కె.ఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. బుధవారం మేడారంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనదేవతల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జాతర సమయానికి ముందుగా పనులన్నీ పూర్తి చేయాలని, ఈ పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను నమూనా మ్యాప్ ద్వారా అధికారులు వివరించారు. అంతకు ముందు శ్రీనివాసరాజు.. సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పూజారులు అమ్మవార్ల శేష వస్త్రం కండువాతో శ్రీనివాసరాజును సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, పూజారులు సిద్ధబో యిన మునీందర్, కాక సారయ్య, కొక్కెర కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.


