డోర్నకల్ రైల్వే స్టేషన్..జలదిగ్బంధం
ఇబ్బందులు పడిన ప్రయాణికులు..
వరద ప్రభావంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఖమ్మం, మహబూబాబాద్‌లకు ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గార్ల మండలానికి చెందిన ఓ గర్భిణి డోర్నకల్ స్టేషన్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుండగా డోర్నకల్ సీఐ చంద్రమౌళి చొరవతో ప్రైవేట్ వాహనంలో ఖమ్మం తరలించారు.
డోర్నకల్: డోర్నకల్ రైల్వే రైల్వే స్టేషన్ జల దిగ్బంధమైంది. బుధవారం తెల్లవారుజామున చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షంగా మారడంతో వరదతో డోర్నకల్ రైల్వే స్టేషన్ జలదిగ్బంధమైంది. కాకతీయ, సింగరేణి, శాతవాహన్ ఎక్స్‌ప్రెస్ రైళళ్లు వెళ్లిపోయిన తర్వాత ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వరంగల్ వైపునకు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే వరదనీరు ట్రాక్ మీదుగా ప్రవహిస్తుండడతో అధికారులు రైలును నిలిపారు. నిమిషాల్లోనే వరదనీరు భారీగా ప్రవహించడంతో ట్రాక్ మునిగింది. గార్ల వైపు నుంచి వస్తున్న గూడ్స్‌ను హోం సిగ్నల్ వద్ద నిలిపారు. మధ్యాహ్నం వరకు వరద పెరగగా రైళ్ల రాకపోకలను నిలిపారు. రైల్వే స్టేషన్‌లోకి వరద భారీగా రావడంతో ట్రాక్‌లు నీట మునగగా, స్టేషన్ యార్డు చెరువును తలపించింది.
కుంటల ఆక్రమణే కారణమా?
డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు ఎగువ ప్రాంతంలో ఉన్న కొర్లకుంటతో పాటు అంబేడ్కర్‌నగర్ సమీపంలోని కుంటల్లో వెంచర్లు ఏర్పాటు చేయడంతో గార్ల మండలంలోని పలు కుంటల నుంచి వచ్చే వరద డోర్నకల్ రైల్వే స్టేషన్‌ను ముంచెత్తింది. డోర్నకల్ పరిధిలోని కుంటలను ఆక్రమించి వెంచర్లను ఏర్పాటు చేయడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డోర్నకల్ రైల్వే స్టేషన్..జలదిగ్బంధం


