కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నిర్వహణకు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ సంబంధిత అధికారులంతా సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గన్నీ బ్యాగులు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో 242 కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణం విషయంలో రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఆర్డీఓ గణేష్, డీసీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు.


