గొర్రెల మందపై చిరుత దాడి
● రెండు జీవాలు మృత్యువాత
కాటారం: మహాముత్తారం మండలంలో చిరుత పులి బీభత్సం సృష్టించింది. శని వారం తెల్లవారుజామున గొర్రెల మందపై దాడికి పాల్పడి రెండు జీవాలను చంపింది. బాధితుడు, అట వీశాఖ అధికారు కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం పర్లపల్లి సమీపంలో మేడిపల్లి రామయ్య అనే వ్యక్తి తన గొర్రెల మందను ఉంచి ఇంటికి వెళ్లాడు. గమనించిన చిరుతపులి మందపై దాడికి పాల్పడి రెండు జీవాలను చంపింది. ఒక గొర్రె రక్తం తాగిన చిరుత.. మరో జీవాన్ని చెట్టుపైకి తీసుకెళ్లింది. ఉదయం మంద వద్దకు వచ్చిన రామయ్య.. తన గొర్రెలపై ఏదో జంతువు దాడి చేసినట్లు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎఫ్‌ఆర్‌ఓ స్వాతి, సిబ్బంది పాదముద్రలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా దాడికి పాల్పడింది చిరుతపులి అని నిర్ధారణకు వచ్చారు. వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. కాగా, చిరుతపులి దాడితో అటవీ గ్రామాల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రేమించిన యువతి దక్కదని యువకుడి ఆత్మహత్య
నర్సంపేట రూరల్: ప్రేమించిన యువతి దక్కదని మనస్తాపం తో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం చెన్నారావుపేట మండలం ధర్మతండాలో వెలుగులోకి వచ్చింది. తండావాసులు, పోలీసు కథనం ప్రకారం.. తండాకు చెందిన బోడ మోహన్ కుమారుడు మహేశ్ (21) డిగ్రీ చదువుతున్నాడు. మండలంలోని ఓ తండాకు చెందిన ఓ యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన మహేశ్ సదరు యువతి తనకు దక్కదని మదనపడ్డాడు. ప్రేమ విషయం తెలియడంతో తల్లిదండ్రులు కూడా ఆ యువకుడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మహేశ్.. ఈనెల 23న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.
గొర్రెల మందపై చిరుత దాడి
గొర్రెల మందపై చిరుత దాడి


