వేయిస్తంభాల గుడిలో నాగుల చవితి పూజలు
హన్మకొండ కల్చరల్: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శనివారం వేయిస్తంభాల దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత పూజలు, మూలగణపతికి ఆరాధన, రుద్రేశ్వరుడికి మహాన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకా లు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధికసంఖ్యలో పాల్గొని వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలోని నాగేంద్రస్వామి శిలలు, పుట్ట కు నీళ్లు, నవరసాలు, పాలతో అభిషేకం చేశారు. పుట్టలో పాలు, పండ్లు, చిమ్మిరి, చలిమిడి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజల్లో హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు, హిమబిందు దంపతులు, రమేశ్‌కుమార్, సూర్యప్రభ దంపతులు పాల్గొని నాగేంద్రస్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ నాగుపాములను పూజించడం అతిప్రాచీన సంస్కృతని, సంతానం, సౌభాగ్యానికి చిహ్నమన్నారు.


