‘తుమ్మి’న జలగండం! | - | Sakshi
Sakshi News home page

‘తుమ్మి’న జలగండం!

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

ఉన్నతాధికారులకు తెలియజేశాం

కర్నూలు సిటీ: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుంచి తెలంగాణ ప్రభుత్వం రోజుకు 392 క్యూసెక్కుల నీటిని తోడేస్తోంది. ఫలితంగా సుంకేసుల జలాశయంలో నాలుగు రోజుల్లోనే 0.256 టీఎంసీల నీటి నిల్వలు తగ్గిపోయాయి. మొత్తం 1.2 టీఎంసీలకు గాను ప్రస్తుతం ఒక టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ ఏడాది తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సుంకేసుల బ్యారేజీ సెప్టెంబరు నెలలో అడుగంటిపోయింది. అయితే కర్ణాటకలో వర్షాలు కురిసి హగేరి నదికి వచ్చిన నీరు సుంకేసులకు చేరింది. ఫలితంగా కర్నూలు నగరవాసులకు, గ్రామీణ ప్రాంతాల్లోని లక్షల మంది ప్రజలకు దాహార్తి తీరుతోంది. అయితే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తోడేస్తుండడంతో కర్నూలు నగర వాసులకు జలగండం పొంచి ఉంది.

టీజీ ఇచ్చిన నివేదికే కారణం

కర్నూలు నగరవాసులకు సుంకేసుల జలాశయం నుంచే తాగునీరు అందుతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం సుంకేసులకు ఎగువన 8 కి.మీ. దూరంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. అప్పుటి చంద్రబాబు ప్రభుత్వం తుమ్మిళ్ల నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయింది. అప్పటి చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా టీజీ వెంకటేష్‌ మానవతా దృక్పథంతో తాగుకు అంటూ తుమ్మిళ్లపై ఇచ్చిన నివేదికనే ఆ లిఫ్ట్‌ వచ్చేందుకు కారణం అయ్యింది. ఈ పథకాన్ని చేపట్టకూడదని అప్పటి ప్రతినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా కర్నూలులో జలదీక్ష చేపట్టారు. అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా లిఫ్ట్‌ పూర్తయి వచ్చిన నీటిని వచ్చినట్లే తెలంగాణ ప్రభుత్వం తోడేస్తోంది.

తుమ్మిళ్లతో తుంగభద్రను తోడేస్తున్నారు!

తుంగభద్ర నది జలాల్లో కేసీ కెనాల్‌కు 31.9 టీఎంసీలు ఇవ్వాలి. అలాగే ఆర్డీఎస్‌ కాల్వకు 15.9 టీఎంసీలు కేటాయించాలి. ఈ మేరకు బచావత్‌ ట్రిబ్యూనల్‌ ఆదేశాలు ఉన్నాయి. కేసీకి 10 టీఎంసీలు, ఆర్డీఎస్‌కు 6.50 టీఎంసీలు టీబీ డ్యాం నిల్వ నీటి నుంచి, మిగిలింది నీటి ప్రవాహ నుంచి వాడుకోవాలి. ఆర్టీఎస్‌ కాల్వ కర్ణాటకలో వస్తుండడంతో నీటిని దిగువ రానివ్వడం లేదని 57 వేల ఎకరాల కోసం తుమ్మిళ్లను సుంకేసుల బ్యారేజీకి 8 కి.మీ దూరంలో ఏర్పాటు చేశారు. మూడు మోటర్లను 1,700 క్యుసెక్కుల నీటి సామర్థ్యతో 2017లో సర్వే చేసి 2018లోనే పనులు పూర్తి చేశారు. ట్రయల్‌రన్‌ చేసి నీటిని ఒక మోటర్‌తో తోడేస్తున్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఏ రోజూ ప్రశ్నించలేదు. ప్రస్తుత క్లిష్ట సమయంలో కూడా నీటిని తోడేస్తున్నా.. బంద్‌ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కోరలేదు. తుమ్మిళ్ల పంపింగ్‌తో నాలుగైదు రోజుల్లోనే సుంకేసులలో కనిష్టస్థాయికి నీటి నిల్వలు తగ్గిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

సుంకేసుల బ్యారేజీ ఎగువన తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల లిఫ్ట్‌ ద్వారా చేస్తున్న పంపింగ్‌ బంద్‌ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ లిఫ్ట్‌ ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తుండడంతో సుంకేసులలో కొంత నీరు తగ్గుతోంది. ఈ విషయం గుర్తించి, ఉన్నతాధికారులకు తెలియజేశాం. సీఈ, కలెక్టర్‌ దృష్టికి సైతం తీసుకుపోతున్నాం.

– శైలేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఈ,

జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌

తుమ్మిళ్ల లిఫ్ట్‌తో తెలంగాణకు

నీటి పంపింగ్‌

స్పందించని చంద్రబాబు ప్రభుత్వం

సుంకేసులలో తగ్గిపోతున్న నీటి నిల్వలు

కర్నూలు నగరవాసులకు

పొంచిన నీటి సమస్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement