ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

● ఆగిన ఈఎల్‌, జీఎఫ్‌లు

కర్నూలు సిటీ: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు దరఖాస్తు గడువు ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ ఎల్‌.సుధాకర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు సమయంలో ఆధార్‌ కార్డులోని విధంగా విద్యార్థి పేరు, తండ్రి పేరు నమోదు చేయాలన్నారు. పరీక్ష రుసుము ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలన్నారు. వచ్చే నెల 29వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులలో కనీసం 70 శాతం మంది ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

15లోగా ఈ–క్రాప్‌ పంటలను ధ్రువీకరించుకోవాలి

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌లో ఈ– క్రాప్‌లో నమోదు చేసిన పంటల వివరాలను రైతులు విధిగా ఈనెల 15లోగా ధ్రువీకరించుకోవాలని(ఈ–కేవైసీ) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు. సంబంధిత రైతు సేవా కేంద్రం లేదా గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఈ–క్రాప్‌లో నమోదు చేసిన పంటలను ధ్రువీకరించుకోవాలన్నారు. రైతులు పంట నమోదు వివరాలను ఆధార్‌ నెంబరు ద్వారా ఓటీపీ, ముఖ గుర్తింపు లేదా బయోమెట్రిక్‌ ద్వారా ధృవీకరించుకునే అవకాశం ఉందన్నారు. రైతులు తమ మొబైల్‌ ఫోన్‌లోనే ఏపీఏఐఎంఎస్‌ 2.0 యాప్‌ను ఉపయోగించి స్వయంగా పంట నమోదును చెక్‌ చేసుకొని ధృవీకరించవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా కూడా ధృవీకరించుకోవచ్చని పేర్కొన్నారు.

క్వింటా వేరుశనగ రూ.7,401

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.7,401 పలికింది. మార్కెట్‌కు 113 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.3,869, మధ్యస్త ధర రూ.5,930 కాగా.. గరిష్ట ధర రూ.7,401 నమోదైనట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. అదేవిధంగా 118 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా క్వింటా గరిష్ట ధర రూ.7,490 పలికింది.

వంద శాతం సబ్సిడీపై 1,500 క్వింటాళ్ల వేరుశనగ

కర్నూలు(అగ్రికల్చర్‌): రబీ సీజన్‌కు జిల్లాలోని 8 మండలాల్లో జాతీయ నూనె గింజల పథకం కింద వేరుశనగ సాగు చేపట్టనున్నారు. ఆయా మండలాల్లో వంద శాతం సబ్సిడీతో టీసీజీఎస్‌–1694( విశిష్ట) రకం వేరుశనగ విత్తనం కాయలను ఎంపిక చేసిన రైతులకు పంపిణీ చేయనున్నారు. 1000 హెక్టార్లలో సాగుకు 1,500 క్వింటాళ్ల వేరుశనగ సరఫరా చేయనున్నారు. మద్దికెర మండలానికి చెందిన లక్ష్మినరసింహస్వామి రైతు ఉత్పత్తిదారుల సంఘం, గోనెగండ్లకు చెందిన నల్లారెడ్డి స్వామి రైతు ఉత్పత్తిదారుల సంఘం వాల్యు చైన్‌ పాట్నర్‌లుగా ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరు, మద్దికెర, గోనెగండ్ల మండలాల్లో ఈ పథకం కింద 20 క్వింటాళ్ల తెల్లకుసుమ విత్తనాలు 100 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తామన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగులకు

అవస్థలు

కర్నూలు(హాస్పిటల్‌):కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన వారికి అరియర్స్‌ సాధించుకోవడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ వారు కార్యాలయం చుట్టూ అరియర్స్‌ కోసం తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వీరి జీతభత్యాలకు సంబంధించి ఇన్‌చార్జ్‌ బాధ్యతలను కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలు మెడికల్‌ కాలేజీకి బదిలీ చేశారు. దీనికితోడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగుల జీతభత్యాలు చూసే ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ రిటైరయ్యారు. దీంతో గత కొన్ని నెలలుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ముప్పుతిప్పలు పడుతున్నారు. మార్చి ఒకటి నుంచి రిటైరైన పది మంది కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా ఈఎల్‌, జీపీఎఫ్‌ల గురించి అడిగితే మాకు సంబంధం లేదంటూ కార్యాలయంలో ఉద్యోగులు ఒకరిపై ఒకరు తోసుకుంటున్నారు. దీంతో మంగళవారం కేఎంసీ ఏడీ కృష్ణమోహన్‌ వద్దకు కొందరు ఉద్యోగులు వెళ్లి సమస్యలు తెలియజేశారు. రెండు, మూడు రోజుల్లో రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement