కర్నూలు: కర్నూలులోని శ్రీరాంనగర్లో నివాసముంటున్న చిట్టిబాబు పెయింటింగ్ కాంట్రాక్టర్. అదే కాలనీలో నివాసముంటున్న ప్రశాంత్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వార్డు కన్వీనర్. మద్దిలేటి చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తుండగా.. నూర్ అహ్మద్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తూ సోషల్ సర్వీస్ చేస్తుంటాడు. చిన్నబాబు ప్లాట్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. వీరంతా వైఎస్సార్సీపీకి సానుభూతిపరులు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే తమపై కనీసం పిటీ కేసు కూడా లేకపోయినప్పటికీ పోలీసులు తమ ఇళ్లల్లో తనిఖీల పేరుతో హడావుడి చేసి బీరువాలు కూడా తెరిచి సామాన్లన్నీ చిందరవందర చేస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మూడో పట్టణ పోలీసులు పెద్ద ఎత్తున శ్రీరాం నగర్కు చేరుకుని తెల్లవారుజామున 5 నుంచి 8.30 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. అయితే పాత నేరస్తులు, నేరచరిత్ర ఉన్న వారి ఇళ్లల్లో తనిఖీలు చేయకుండా కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లల్లోనే తనిఖీలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.


