కర్నూలు(సెంట్రల్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముందుగానే అంచనా వేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ నంబర్లు, వార్డు నంబర్లు, ఎంఎస్పీ, ఎల్ఎస్పీ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. సిబ్బందికి ఎన్నికల విధులు, బాధ్యతలు, పోలింగ్ నిర్వహణ విధానాలపై సమగ్ర శిక్షణ అందించాలన్నారు. లైసెన్సుడ్ ఆయుధాలు కలిగిన వారి వివరాలను సమీక్షించాలని, ఎకై ్సజ్ అధికారులు మద్యం నిల్వలు, రోజువారీ విక్రయాలు, ఉత్పత్తి వివరాలను పర్యవేక్షిస్తూ నివేదికలు సమర్పించాలని తెలిపారు. జేసీ నూరుల్ఖమర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


