● స్థానిక సంస్థల ఎన్నికల్లో
టీడీపీకి ఓటమి తప్పనిసరి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
దేవనకొండ: టీడీపీ నేతల కక్షలు.. మోసాలు ఇక సాగబోవని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. దేవనకొండలో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి, దేవనకొండ మండలాల్లో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉందని కక్షగట్టి కరువు జాబితాలో లేకుండా చంద్రబాబు ప్రభుత్వం చేసిందన్నారు. రైతులకు పంటల బీమా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. తాను వైఎస్సార్సీపీ కార్యకర్త ఆపదలో ఉన్నాడని తెలుసుకుని వెళితే ఒక ఆడబిడ్డను అడ్డం పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అక్రమంగా 70 రోజులు జైలులో ఉంచారన్నారు. దీనికి కారణం వైకుంఠం జ్యోతినేనని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎన్నిసార్లయినా జైలుకు పంపినా బెదరనని, చివరకు తన ప్రాణం ఇవ్వడానికై నా సిద్ధంగా ఉన్నానన్నారు. ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్య పడకుండా తనకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చన్నారు. అర్ధరాత్రి కూడా కాపాడుకోవడానికి వస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. టీడీపీ చేస్తున్న మోసాలను గడపగడపకు వివరించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామకృష్ణ, మండలంలోని నాయకులు దివాకర్‌నాయుడు, ప్రభాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, లుముంబా, హర్షవర్ధన్‌రెడ్డి, కొత్తకాపు మధుసూదన్‌రెడ్డి, కబీర్దాస్, మదనమోహన్‌రెడ్డి, హంపిరెడ్డి పాల్గొన్నారు.


