గోస్పాడు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను చోరీ చేసే దొంగల ముఠాను గోస్పాడు పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. సోమవారం మండల కేంద్రం గోస్పాడులోని పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డితో కలిసి నంద్యాల ఏఎస్పీ సుస్మిత విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన దొడ్డగాళ్ల ప్రకాష్, నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే పాల్తి గోపి నాయక్, నంద్యాల దేవ నగర్‌కు చెందిన షేక్ షబ్బీర్ హుస్సేన్, గోస్పాడు మండలం యాల్లూరు గ్రామానికి చెందిన సలవాది మధు, శిరివెళ్ల మండలం ఎరగ్రుంట్ల గ్రామానికి చెందిన చాకలి తేజతో పాటు ఒక బాలుడు ముఠాగా ఏర్పడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బైక్‌లు చోరీ చేసేవారు. వాటిని గోస్పాడు మండలం తేళ్లపురి గ్రామ శివారులోని కుందూ నది బ్రిడ్జ్ వద్ద గల కంపచెట్లలో దాచారు. వాటిని సోమవారం బయటకు తీస్తుండగా పోలీసులు కనిపించడంతో పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వెంబడించి ముఠాసభ్యుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 6 లక్షలు విలువ చేసే 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నిందితులను ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరుచగా రిమాండ్‌కు ఆదేశించినట్లు ఏఎస్పీ వెల్లడించారు.


