కర్నూలు(అగ్రికల్చర్): చేపల పెంపకం, మార్కెటింగ్ తదితరాలపై 7వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు మే నెల 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథబాబు తెలిపారు. కర్నూలు బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రం(ఐఎఫ్‌టీసీ)లో 146వ జట్టులో నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధిలో రాణించే విధంగా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఈ నెల 29లోగా దరఖాస్తులను తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 30న ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరు కావాలని కోరారు. వివరాలకు కర్నూలు నగరం బంగారుపేటలోని మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
11న మహాత్మా జ్యోతిబాపూలే జయంతి
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాన్ని 11వ తేదీ శనివారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా షరీన్ నగర్ వద్ద, బిర్లా గేట్ సర్కిల్ వద్ద ఉన్న పూలే విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పిస్తామన్నారు. అనంతరం బిర్లాగేట్ సర్కిల్‌లో సభ నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖాధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కోరారు.
10 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10 నుంచి మే నెల 7వ తేదీ వరకు డిగ్రీ రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసిహులు తెలిపారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు వెల్లడించారు. మొత్తం 48 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెగ్యులర్ 7282 మంది, సప్లిమెంటరీ 10,372 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. నిర్దేశించిన సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
నిప్పుల కొలిమి
● దొర్నిపాడులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గురువారం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దొర్నిపాడులో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. గోస్పాడులో 42.8, ఆళ్లగడ్డలో 42.7, రుద్రవరంలో 42.6, చాగలమర్రిలో 42.3, నంద్యాల రూరల్‌లో 42.3, అవుకులో 42.2, బనగానపల్లిలో 42.2, కౌతాలంలో 41.6, మంత్రాలయంలో 41.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్న సమయంలో గాలిలో తేమ 10 శాతానికి పడిపోతుండటంతో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
● పార్టీకి 11వ వార్డు ఇన్‌చార్జ్,
మాజీ కౌన్సిలర్ రాజీనామా
ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీకి అసమ్మతి సెగ తగిలింది. గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీకి 11 వార్డు ఇన్‌చార్జ్ జహంగీర్, మాజీ కౌన్సిలర్ దౌలత్‌బీలు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. తాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నానని, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నిజమైన కార్యకర్తలును గుర్తించడం లేదన్నారు. సమస్యలు చెప్పటానికి ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. ఫోన్ చేస్తే స్పందన ఉండటం లేదని, రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని, ఎమ్మెల్యే తీరు నచ్చకనే బయటకు వస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే తన చుట్టూ ఉన్న ఇద్దరు, ముగ్గురు మాటలు నమ్మకుంటు వెళ్తే పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందన్నారు. తనతో పాటు త్వరలో మరికొందరు పార్టీని వదిలేందుకు సిద్ధపడుతున్నారన్నారు.


