కర్నూలు (సెంట్రల్): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ మేయర్ బీవై రామయ్యను నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఎగుమతులు లేకనే ఉల్లి ధర పతనం
కర్నూలు(అగ్రికల్చర్): ఎగుమతులు లేకపోవడం వల్లే ఉల్లిగడ్డల ధర తగ్గుతోందని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. బుధవారం శ్రీసాక్షిశ్రీలో ధర లేని ఉల్లి.. రైతు తల్లడిల్లి శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆమె వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎగుమతులను కేంద్రం నిలిపివేయడం వల్లే ధరలు పడిపోయాయని వ్యాపారులు వివరించారు. రాష్ట్రంలో 80 శాతం ఉల్లి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. ఇక్కడ పండించిన ఉల్లి ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌కు తరలుతుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌తో పాటు పలు దేశాలకు ఎగుమతి అవుతుంది. ఎగుమతులు ఉంటేనే ఉల్లికి డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే బుధవారం ఉల్లి ధరలు మరింత పడిపోయాయి. మార్కెట్‌కు 1,390 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనిష్ట ధర రూ.314, గరిష్ట ధర రూ.989 లభించగా.. సగటు ధర రూ.689 మాత్రమే నమోదైంది.
ఆర్జేడీ వెబ్‌సైట్‌లో తాత్కాలిక సీనియారిటీ జాబితా
కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యలకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లు, సమాన హోదాల నుంచి గ్రేడ్–2 హెచ్‌ఎం పదోన్నతులకు సవరించిన తాత్కాలిక సీనియారిటీ జాబితా ఆర్జేడీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు తమ సర్వీస్ వివరాలు, సీనియారిటీ స్థానాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధార పత్రాలతో కడప ఆర్జేడీ మెయిల్ rjdrekadapa@aprchooed u.in ద్వారా ఈ నెల 11వ తేదిలోపు సమర్పించాలని డీఈఓ పేర్కొన్నారు.
స్పాట్ కేంద్రం వద్ద నేడు నిరసన
కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాఫ్టో) ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నేడు(గురువారం) టెన్త్ స్పాట్ కేంద్రం వద్ద నిరసన తెలుపనున్నట్లు ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ ఎం.మధుసూదన్ రెడ్డి, సెక్రటరీ జనరల్ భాస్కర్‌లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన కార్యక్రమానికి ఫ్యాఫ్టో రాష్ట్ర కో–చైర్మన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ప్రకాష్‌రావు, జి.హృదయరాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
క్వింటా వేరుశనగ రూ.7,410
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం 197 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా ధర గరిష్టంగా రూ.7,410 పలికిందని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర రూ.4,570, మధ్యస్త ధర రూ.5,893 నమోదైందన్నారు. ఆముదాలు 33 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,870, గరిష్ట ధర రూ.5,900 పలికిందన్నారు.
14న ట్రాఫిక్ పీఎస్‌లో వాహనాల వేలం
కర్నూలు: ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కర్నూలు నగర పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 31 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, కోర్టు ఆదేశాల ప్రకారం బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయించామన్నారు. వేలం దక్కించుకున్న వాళ్లు అదే రోజు మొత్తం డబ్బు చెల్లించి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు.


