కర్నూలు: బాలలకు రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో బాలలు, న్యాయచట్టంపై గురువారం అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల నేరస్తుల్లో నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాలన్నారు. బాల నేరస్తులను సన్మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పిలుపునిచ్చారు. జువైనెల్ జస్టిస్ యాక్ట్ గురించి చైర్మన్ కమ్ ప్రిన్సిపాల్ మెజిస్ట్రేట్ టి.అపర్ణ తెలియజేశారు. ప్రజా వినియోగ సేవల కోసం శాశ్విత లోక్ అదాలత్ అధ్యక్షులు వెంకటహరినాథ్ పలు రంగాలకు సంబంధించి ఎలాంటి సేవల్లో లోపం కాని, నష్టం కాని, అన్యాయం కాని జరిగితే తక్షణమే పర్మనెంట్ లోక్ అదాలత్‌లో వినతిపత్రంతో పాటు తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా తక్కువ సమయంలో న్యాయం చేస్తామని తెలిపారు. మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్ర బాబు మాట్లాడుతూ పిల్లల కేసుల పట్ల ఎలా విచారణ చేయాలో పోలీసులకు తెలియజేశారు. కార్యక్రమంలో మానసిక వైద్యనిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ బాషా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ, తదితరులు పాల్గొన్నారు.


